Share News

ISRO Icon Passes: ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ కన్నుమూత

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:06 AM

ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్‌ వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో కన్నుమూశారు. ఆయన హైస్పీడ్‌ అంతరిక్ష ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధికి చేసిన సేవలు అపూర్వమైనవిగా మిగిలాయి

ISRO Icon Passes: ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ కన్నుమూత

  • వృద్ధాప్య సమస్యలతో బెంగళూరులో తుదిశ్వాస

  • తొమ్మిదేళ్లపాటు ఇస్రో చైర్మన్‌గా విశేష సేవలు.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ నివాళి

బెంగళూరు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష రంగంలో విశేష సేవలందించిన ఇస్రో మాజీ చైర్మన్‌ కృష్ణస్వామి కస్తూరిరంగన్‌ బెంగళూరులో కన్నుమూశారు. కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కస్తూరి రంగన్‌ (84) శుక్రవారం మారతహళ్ళిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. చివరి చూపు కోసం ఆయన పార్థివదేహాన్ని ఆదివారం రామన్‌ రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ)లో ఉంచి అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు. కేరళలోని ఎర్నాకుళంలో కృష్ణస్వామి అయ్యర్‌, విశాలాక్షి దంపతులకు 1940 అక్టోబరు 24న కస్తూరి రంగన్‌ జన్మించారు. 1994లో ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కస్తూరిరంగన్‌ తొమ్మిదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగి 2003 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. ఆ సమయంలో ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మకమైన పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అంతకుముందు ఆయన ఇస్రో ఉపగ్రహ కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇన్‌శాట్‌-2, ఐఆర్‌ఎస్-1ఏ, 1బీ విజయవంతానికి శ్రమించారు. భాస్కర-1, 2 ప్రాజెక్టులకు డైరెక్టర్‌గానూ సేవలందించారు. సివిల్‌ శాటిలైట్‌ ఐఆర్‌ఎస్-1సీ, 1డీ ప్రయోగాలతోపాటు మూడోతరానికి అవసరమైన ప్రయోగాలను సైతం విజయవంతం చేశారు. ఐఆర్‌ఎస్‌ పీ3, పీ4ల లాంచింగ్‌లో కీలకపాత్ర పోషించారు. జవరహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ సెంటర్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. 2003-2009 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యుడిగానూ సేవలందించారు. భారత ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ పనిచేశారు. దేశానికి చేసిన సేవలకుగానూ పద్మశ్రీ, పద్మభూషణ్‌, పద్మవిభూషణ్‌ అవార్డులు ఆయనను వరించాయి.


మహోన్నత వ్యక్తిని కోల్పోయాం: మోదీ

ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయనకు ఘన నివాళి అర్పించారు. ‘భారత వైజ్ఞానిక, విద్యారంగంలో మహోన్నత వ్యక్తి కస్తూరి రంగన్‌ మరణం తీవ్రంగా కలచివేసింది. ఆయన దార్శనిక నాయకత్వం, దేశానికి చేసిన నిస్వార్థ సేవ ఎప్పటికీ గుర్తిండిపోతాయి. ఎంతో అంకిత భావంతో ఇస్రోకు సేవలందించిన ఆయన.. భారత అంతరిక్ష రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు’ అని మోదీ కొనియాడారు. కాగా, కస్తూరి రంగన్‌ మృతి దేశానికి తీరని లోటని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఎక్స్‌లో పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ కూడా కస్తూరి రంగన్‌ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. భారత అంతరిక్ష పరిశోధనల్లో ఆయన విశేష కృషి చేశారని అన్నారు.

కస్తూరి రంగన్‌ ఒక ఆణిముత్యం: ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌

కస్తూరిరంగన్‌ ఒక లెజెండరీ నాయకుడని, 20వేల మందితో కూడిన ఇస్రోకు ఆయన కుటుంబం లాంటివారని ఇస్రో చైర్మన్‌ వి నారాయణన్‌ అన్నారు. ఇస్రోను ప్రపంచస్థాయి సంస్థగా ఆయన తీర్చిదిద్దారని, తనలాంటి యువకులను ఎంతగానో ప్రోత్సహించారని కొనియాడారు. చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతమైనప్పుడు ఆయన బాగా సంతోషించారని, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆయన ఒక ఆణిముత్యమని పేర్కొన్నారు. కస్తూరిరంగన్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కాగా.. కస్తూరిరంగన్‌ తన మాయాజాలంలో ఇస్రోకు అనేక అద్భుత విజయాలు కట్టబెట్టారని ఆయన సహచరులు, జూనియర్లు గుర్తుచేసుకున్నారు.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 05:06 AM