EPS: మాజీ సీఎం ఈపీఎస్ సరికొత్త పంథా..
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:29 AM
రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ‘దోపిడీలు-దొంగలు’, ‘సత్యం కోసం-స్వేచ్ఛ కోసం’అనే కొత్త ప్రచార పథకానికి శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలకు ఇచ్చిన హామీల్లో డీఎంకే ప్రభుత్వం 99 శాతం నెరవేర్చకుండా ప్రజలకు మొండి చెయ్యి చూపించిందన్న పదాలతో కూడిన లోగోను ఆయన ఆవిష్కరించారు.

- అమలు కాని హామీలను వివరిస్తూ ప్రచారం
చెన్నై: రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకునేలా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswamy) ‘దోపిడీలు-దొంగలు’, ‘సత్యం కోసం-స్వేచ్ఛ కోసం’అనే కొత్త ప్రచార పథకానికి శ్రీకారం చుట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రప్రజలకు ఇచ్చిన హామీల్లో డీఎంకే ప్రభుత్వం 99 శాతం నెరవేర్చకుండా ప్రజలకు మొండి చెయ్యి చూపించిందన్న పదాలతో కూడిన లోగోను ఆయన ఆవిష్కరించారు.
2026 అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలుసుకుని డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఈ నెల 7న కోవై జిల్లా మేట్టుపాళయం నుంచి తన ప్రచార యాత్ర ప్రారంభించిన ఈపీఎస్ ప్రస్తుతం పుదుకోట జిల్లాల్లోని నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన 525 హామీల్లో నెరవేర్చని 10 హామీల గురించి ప్రజలకు వివరించేలా రూపొందించిన లోగోను పుదుకోట రోడ్‌షోలో ఆవిష్కరించారు.
అనంతరం తాను చేపట్టిన వినూత్న ప్రచారం గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చేపట్టిన ‘మక్కలై కాప్పోం-తమిళగతై మీడ్పోం’ ప్రచారం ప్రజల అండదండలు, మిత్రపక్షాల మద్దతుతో విల్లుపురం, కడలూరు, పెరంబలూరు, అరియలూరు, తిరువారూర్, నాగపట్నం, తంజావూరు జిల్లాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయవంతంగా సాగిందన్నారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు ల్యాప్‌ట్యా్‌పలు పంపిణీ చేశామని, అదేవిధంగా ఉన్నత విద్యలో చేరి చదువుకునేందుకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయించామని, అయితే ఈ నాలుగేళ్ళలో డీఎంకే ప్రభుత్వం ఆ పథకాలను నిలిపివేసిందన్నారు.
గ్రామ పంచాయతీలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన సీఎం స్టాలిన్ ప్రభుత్వం సొంత తోటల్లో నిర్మించుకునే ఇళ్లకు కూడా అనుమతి పొందాలని, లేనిపక్షంలో వాటికి సీలు వేయాలని ఆదేశాలివ్వడం, సరికాదని, ఇప్పటివరకు ఆచరణలో లేని ఈ సంఘటనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రిసీడియం కార్యదర్శి, మాజీ మంత్రి, పుదుకోట ఎమ్మెల్యే డా.సి.విజయ్‌భాస్కర్, మాజీఎమ్మెల్యే నెడుంచెళియన్‌లతో పాటు యువజన, కార్మిక తదితర విభాగాలకు చెందిన నిర్వాహకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్ ధర పెంపు
Read Latest Telangana News and National News