Chirag Paswan: నితీష్‌కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నా... కేంద్ర మంత్రి నిప్పులు
ABN , Publish Date - Jul 26 , 2025 | 05:11 PM
బిహార్‌లో హోం గార్డ్ రిక్రూట్‌మెంట్‌కు హాజరైన 26 ఏళ్ల మహిళ స్పృహతప్పిపోవడం, అంబులెన్స్‌లోనే ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో పాశ్వాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాట్నా: ఈ ఏడాది చివర్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న తరుణంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar)కు కేంద్ర మంత్రి, లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్-విలాస్) నేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) గట్టి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో నేరాలు అదుపు చేసే సామర్థ్యం లేని నితీష్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నానని అన్నారు. బిహార్‌లో హోం గార్డ్ రిక్రూట్‌మెంట్‌కు హాజరైన 26 ఏళ్ల మహిళ స్పృహతప్పిపోవడం, అంబులెన్స్‌లోనే ఆమెపై అత్యాచారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో పాశ్వాన్ తాజా వ్యాఖ్యలు చేశారు.
హత్యలు, అపహరణలు, దొంగతనాలు, అత్యాచారాలను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పాశ్వాన్ విమర్శించారు. 'బిహార్‌లో వరుస నేరాలు చేస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా నేరగాళ్ల ముందు మోకరిల్లినట్టు ఉంది. ఇలాంటి ఘటనలను ఖండించాల్సిందే. కానీ ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? నిరంతరం నేరాలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పరిస్థితి భయానకంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిని కప్పిపుచ్చే ప్రయత్నం ఎంతో కాలం సాగదు' అని అన్నారు. క్రైమ్ రేటును ప్రభుత్వం తగ్గించలేకపోతోందని, ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతిస్తున్నందుకు అసంతృప్తిగా ఉందని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం మేలుకొని నేరాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై నితీష్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌ను చిరాగ్ పాశ్వాన్ విమర్శించడం ఇదే మొదటిసారి కాదు. నేరస్థుల నైతిక స్థైర్యానికి హద్దులు లేకుండా పోయాయని పాశ్వాన్ గత నెలలో విమర్శించారు. ప్రతిరోజూ హత్యలు జరుగుతున్నాయని, నేరస్థులు బహిరంగంగానే శాంతి భద్రతలపై సవాళ్ళు విసురుతున్నారని ఆక్షేపణ తెలిపారు. కాగా, అక్టోబర్-నవంబర్ మాసాల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
హోంగార్డు పరీక్షలో స్పృహ కోల్పోయిన మహిళ, అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం
సిద్ధరామయ్య, డీకే ప్రత్యేక అధికారుల మధ్య బాహాబాహీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి