Fake Embassy: ఇంద్రభవనం, ఫ్యాన్సీ కార్లు.. నకిలీ రాయబార కార్యాలయం గుట్టురట్టు
ABN , Publish Date - Jul 23 , 2025 | 04:36 PM
వెస్టార్కిటికా బారన్‌గా పరిచయం చేసుకుంటూ దౌత్యనెంబర్ ప్లేట్లు కలిగిన కార్లలో జైన్ ప్రయాణిస్తుంటాడని, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులతో మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఆఫీసులో పెట్టుకున్నాడని గుర్తించారు.

న్యూఢిల్లీ: విలాసవంతమైన భవనం.. బయట డిప్లొమేటిక్ నంబర్ ప్లేట్లతో ఫ్యాన్సీ కార్లు, లోపల డిప్లమేటిక్ పాస్‌పార్ట్‌లు. అనుమానం వచ్చిన ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు లోపలకు వెళ్లిచూడగా అసలు గుట్టు బయటపడింది. అది నకిలీ రాయబార కార్యాలయంగా గుర్తించిన అధికారులు అవాక్కయ్యారు. దీన్ని నడుపుతున్న హర్షవర్ధన్ జైన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన వెలుగుచూసింది.
హర్షవర్ధన్ జైన్ రెండు అంతస్తుల లగ్జరీ భవనాన్ని అద్దెకు తీసుకుని దానిని 'వెస్టార్కిటికా' రాయబార కార్యాలయంగా నడుపుతున్నట్టు అధికారులు గుర్తించారు. అమెరికాలో నేవీ అధికారి అయిన ట్రావిస్ మెక్‌హెన్రీ 2001లో వెస్టార్కిటికాను స్థాపించాడు. దానికి తనను తాను గ్రాండ్ డ్యూక్‌గాకూడా నియమించుకున్నాడు. అయితే ఈ వెస్టార్కిటికాను ఏ దేశం కూడా గుర్తించలేదు. హర్షవర్ధన్ జైన్ దీనికి 'బారన్'గా పరిచయం చేసుకుని ఘజియాబాద్‌లో రాయబార కార్యాలయం నడిపిస్తున్నాడు. విదేశాల్లో పని ఇప్పిస్తామంటూ యువకులను ఆకర్షించడానికి ఉద్యోగాల రాకెట్ నడుపుతున్నాడు. ఇది మనీలాండరింగ్ నెట్‌వర్క్‌లో భాగంగా ఎస్‌టీఎఫ్ అధికారులు చెబుతున్నారు. వెస్టార్కిటికా బారన్‌గా పరిచయం చేసుకుంటూ దౌత్యనెంబర్ ప్లేట్లు కలిగిన కార్లలో జైన్ ప్రయాణిస్తుంటాడని, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులతో మార్ఫింగ్ చేసిన చిత్రాలను ఆఫీసులో పెట్టుకున్నాడని గుర్తించారు. ఆశ్చర్యకరంగా 2011లో చట్టవిరుద్ధంగా శాటిలైట్ ఫోన్ ఉన్నట్టు జైన్‌పై కేసు కూడా నమోదైంది.
ఎస్‌టీఎఫ్ అధికారులు నకిలీ రాయబార కార్యలయం నుంచి దౌత్య నెంబర్ ప్లేట్లు కలిగిన 4 హై-ఎండ్ కార్లు, 12 మైక్రోనేషన్ల 'దౌత్య పాస్‌పోర్టులు', విదేశాంగ మంత్రిత్వ శాఖ స్టాంపులు కలిగిన 34 దేశాల స్టాంపులు, రూ.44 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, 18 దౌత్య నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద జైన్‌పై కేసు నమోదు చేశారు.
ఏమిటీ వెస్టార్కిటికా?
అంటార్కిటికా వ్యవస్థలోని లొసుగుల ఆధారంగా ట్రావిక్ మెక్‌హెన్రీ 6,20,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని భూభాగాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాడు. గ్రాండ్ డ్యూక్‌గా తనను తాను నియమించుకున్నాడు. అక్కడ 2,356 మంది పౌరులున్నట్టు అధికారికంగా పేర్కొన్నాడు. అయితే అక్కడ ఎవరూ కనిపించరు. ఏ దేశం కూడా వెస్టార్కిటికాను గుర్తించలేదు.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చకు తేదీ ఖరారు
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ.. సీఈసీ కీలక ప్రకటన
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి