Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంటులో చర్చకు తేదీ ఖరారు
ABN , Publish Date - Jul 23 , 2025 | 03:16 PM
కీలకమైన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రధానమంత్రి ఉభయసభలు, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని విపక్షాల డిమాండ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై ఈనెల 29న పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరగనుంది. 16 గంటల సేపు చర్చ జరిపేందుకు పార్లమెంట్ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (BAC) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
కీలకమైన 'ఆపరేషన్ సిందూర్' అంశంపై ప్రధానమంత్రి ఉభయసభలు, దేశాన్ని ఉద్దేశించి మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. తన జోక్యంతోనే ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ప్రకటించుకోవడంతో విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. అసలు ఎలాంటి ఒప్పందం జరిగిందని ప్రశ్నిస్తున్నాయి.
ట్రంప్ 25 సార్లు చెప్పారు: రాహుల్
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు తానే ఒప్పించానని ట్రంప్ ఇప్పటివరకూ 25 సార్లు చెప్పారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాలని పార్లమెంటు ప్రాంగణంలో బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు. దేశ భక్తులమని చెప్పుకుంటున్న వారు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నారని, ప్రధాని దీనిపై కనీసం ఒక్క ప్రకటనా చేయలేదని అన్నారు. 'ఇది తన పనేనని ప్రకటన చేయడానికి ట్రంప్ ఎవరు? ఇది ఆయన పని కాదు. ప్రధాని ఇంతవరకూ స్పందించకపోవడం వాస్తవం' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ.. సీఈసీ కీలక ప్రకటన
భారీ వర్షాలతో హిమాచల్ ప్రదేశ్‌లో అల్లకల్లోలం..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి