Share News

EPF: ఈపీఎఫ్‌ వడ్డీ ఈసారీ 8.25 శాతమే

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:44 AM

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఈపీఎఫ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీ్‌స(సీబీటీ) సమావేశం నిర్ణయించింది.

EPF: ఈపీఎఫ్‌ వడ్డీ ఈసారీ 8.25 శాతమే

  • ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే మరణిస్తే

  • కుటుంబానికి కనీస బీమా రూ.50 వేలు

  • ఉద్యోగం మారినప్పుడు 2 నెలల విరామం

  • వచ్చినా పూర్తి కాలం సర్వీసుగానే..

  • సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ నిర్ణయాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) నిల్వలపై 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఈపీఎఫ్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీ్‌స(సీబీటీ) సమావేశం నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే వడ్డీ రేటు అమలైంది. ఈ ఏడాదీ ఇదే రేటును కొనసాగించాలన్న సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వ ఆమోదం తర్వాత వడ్డీ రేటును ఈపీఎ్‌ఫవో నోటిఫై చేయనుంది. కేంద్ర కార్మికశాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవీయ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో వడ్డీరేటు ఖరారుతోపాటు పలు కీలక అంశాలకు బోర్డు ఆమోదం తెలిపింది. ఉద్యోగుల డిపాజిట్లకు అనుబంధంగా ఉన్న బీమా(ఈడీఎల్‌ఐ) పథకం కింద అందుతున్న ప్రయోజనాలను పెంచాలని సమావేశంలో నిర్ణయించారు. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపు ఈపీఎఫ్‌ సభ్యులు మరణిస్తే.. వారి కుటుంబాలకు కనీస జీవిత బీమా ప్రయోజనం కింద రూ.50వేలు అందించాలన్న ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది.


అలాగే, చివరిగా చందా చెల్లించిన ఆరు నెలల్లోగా సభ్యుడు మరణిస్తే.. ఈడీఎల్‌ఐ ప్రయోజనాలను అమలు చేయాలని సమావేశం నిర్ణయించింది. కాగా, ఉద్యోగం మానేసి మరో ఉద్యోగంలో చేరినప్పుడు ఈపీఎఫ్‌ సర్వీసుకు ఒక్క రోజు విఘాతం ఉన్నా.. ప్రస్తుతం ఈడీఐఎల్‌ ప్రయోనాలు అందించడం లేదు. ఇకపై.. రెండు నెలల వ్యవధి వచ్చినా వారు నిరంతరం సర్వీసులో ఉన్నట్టే పరిగణించనున్నారు. అలాంటి ఉద్యోగులు మరణిస్తే.. ఆయా కుటుంబాలకు కనీస బీమా కింద రూ.2.5లక్షలు అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాల మూలంగా ఏటా 20 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఈపీఎ్‌ఫవో వర్గాలు తెలిపాయి. కాగా, తాము వడ్డీరేటును 8.30 శాతానికి పెంచాలని కోరగా, 8.25 శాతానికే సీబీటీ అంగీకరించిందని ట్రేడ్‌ యూనియన్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ తెలిపింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపు మరణించిన వారికీ.. ఈడీఎల్‌ఐ పథకాన్ని వర్తింపజేయడం చరిత్రాత్మకమని ప్రశంసించింది. ఈపీఎఫ్‌ చందా కట్టడం మానేసిన తర్వాత ఆరు నెలల్లోపు మరణిస్తే ప్రయోజనాలు చేకూర్చాలని నిర్ణయించడం, రెండు నెలల్లోపు కొత్త ఉద్యోగంలో చేరితే పూర్తికాలం ఉద్యోగంలో ఉన్నట్టే భావించి ప్రయోజనాలు సమకూర్చడం చెప్పుకోదగ్గ నిర్ణయాలని పీయూసీసీ ప్రధాన కార్యదర్శి తివారీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Mar 01 , 2025 | 05:44 AM