Share News

ED: రూ.2వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి సోనియా, రాహుల్‌ కుట్ర

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:11 AM

తొంభై కోట్ల రూపాయల అప్పును సాకుగా చూపి.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కుట్రపన్నారని ఈడీ ఆరోపించింది.

ED: రూ.2వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి సోనియా, రాహుల్‌ కుట్ర

  • నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ వాదన.. నేడూ విచారణ

న్యూఢిల్లీ, జూలై 2: తొంభై కోట్ల రూపాయల అప్పును సాకుగా చూపి.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాజేసేందుకు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కుట్రపన్నారని ఈడీ ఆరోపించింది. ఇందుకోసమే ‘యంగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థను ఏర్పాటు చేశారని.. అందులో సోనియా, రాహుల్‌కు 76 శాతం షేర్లున్నాయని పేర్కొంది. నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి.. ఢిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు.. ప్రత్యేక న్యాయమూర్తి విశాల్‌ గోగ్నే దృష్టికి పలు కీలక విషయాలను తీసుకొచ్చారు. ఏజేఎల్‌ సంస్థ ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) నుంచి రూ.90 కోట్లు అప్పుగా తీసుకుందని.. రూ.2000 కోట్ల ఆస్తులున్న ఆ సంస్థకు ఆ అప్పును తీర్చడం చిన్నపిల్లల ఆటతో సమానమని ఆయన పేర్కొన్నారు. కానీ, ఈ కేసులో ఆ రూ.90 కోట్లకు బదులుగా ఏజేఎల్‌ ఆస్తులు మొత్తాన్నీ స్వాధీనం చేసుకోవడానికి సోనియా, రాహుల్‌ ‘యంగ్‌ ఇండియన్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశారని వివరించారు.


దాని ఎండీగా రాహుల్‌ నియమితులైన ఆరురోజుల్లోనే.. ‘అప్పు తీర్చండి లేదా దాన్ని ఈక్విటీ రూపంలోకి మార్చండి’ అనే ప్రతిపాదనను ఏజేఎల్‌కు పంపారని రాజు కోర్టుకు తెలిపారు. తర్వాత ఏజేఎల్‌ తన ఆస్తులన్నింటినీ యంగ్‌ ఇండియన్‌ సంస్థకు ఇచ్చేసిందని పేర్కొన్నారు. ఈ ఆస్తులన్నీ ఏజేఎల్‌కు 1947 తర్వాత కేంద్రప్రభుత్వం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చినవేనని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రత్యక్ష లావాదేవీలకు తాను దూరంగా ఉండడానికే.. ‘యంగ్‌ ఇండియన్‌’ సంస్థను ఏఐసీసీ సృష్టించిందని చెప్పారు. రూ.90 కోట్ల రుణానికి బదులుగా మొత్తం ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకుంటారన్నదే ప్రశ్న అని ఎస్వీ రాజు వాదించారు. ఈ వ్యవహారంలో షేర్ల అమ్మకాలు, కొనుగోళ్లు.. అన్నీ బోగస్‌ లావాదేవీలేనని కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణ గురువారం కొనసాగనుంది.

Updated Date - Jul 03 , 2025 | 06:11 AM