Share News

DK Shivakumar: ఆయన మౌనం వెనుక... ఆంతర్యం ఏమిటో..

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:32 PM

ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌ ఒక్కసారిగా దిగాలు పడ్డారు.

DK Shivakumar: ఆయన మౌనం వెనుక... ఆంతర్యం ఏమిటో..

- రెండేళ్లుగా నాయకత్వ మార్పుపై చర్చలు

- అధిష్ఠానం సీఎంకు అభయమిచ్చిందా?

బెంగళూరు: ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిని అంటూ సిద్దరామయ్య ఢిల్లీ వేదికగా పదే పదే ప్రకటించినా అధిష్ఠానానికి చెందిన ముఖ్యులు ఎవరూ స్పందించకపోవడం, పైగా గతంలో మాదిరిగా ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హుకుం జారీ చేసిన అగ్రనేతలు ఈ అంశమే మాకు సంబంధం లేదనేలా ఉండడంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న డీకే శివకుమార్‌(DK Shivakumar) ఒక్కసారిగా దిగాలు పడ్డారు.

రెండేళ్ల కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పలుమార్లు నాయకత్వ మార్పు అంశంపై వ్యాఖ్యలు వచ్చాయి. సిద్దరామయ్య ఐదేళ్లు ఉంటారని మంత్రులు పదే పదే వ్యాఖ్యానించారు.


ఆ వెంటనే అధిష్ఠానం అప్రమత్తమైంది. ఎవరూ నాయకత్వ మార్పు గురించి మాట్లాడరాదని హెచ్చరించింది. ఈ ఏడాది ప్రారంభంలో దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేసుకునేందుకు అధిష్ఠానం అభ్యంతరం తెలిపింది. మంత్రి సతీశ్‌జార్కిహొళి కొంతమంది ఎమ్మెల్యేలతో విదేశీ పర్యటనకు వెళ్లేందుకు ఢిల్లీనేతలు అభ్యంతరం తెలిపారు. రెండో ఏడాది పాలన ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు అధిష్ఠానం జోక్యం చేసుకుంది. సీనియర్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ పాటిల్‌, రాజు కాగె వంటివారు బహిరంగంగానే ప్రభుత్వం వద్ద నిధులు లేవని వ్యాఖ్యానించడంతో అధిష్ఠానం అప్రమత్తమై రంగంలోకి దిగింది.


ఏకంగా ఆరు రోజులపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌, ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ రణదీప్ సింగ్‌ సుర్జేవాలా ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా వన్‌ టూ వన్‌ తరహాలో చర్చలు జరిపారు. ఇలా సాగుతున్న తరుణంలోనే సీఎం సిద్దరామయ్య ఐదేళ్లు నేను ముఖ్యమంత్రిని అంటూ బహిరంగంగా ప్రకటించారు. తొలిసారి శివకుమార్‌ సమక్షంలోనే బెంగళూరులో వ్యాఖ్యానించిన సిద్దరామయ్య ఢిల్లీలో ఓ చానెల్‌ ఇంటర్వ్యూతోపాటు పదే పదే మీడియా ముందు ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి అన్నారు. పైగా డీకే శివకుమార్‌కు ఎక్కువమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడం లేదన్నారు.


pandu1.2.gif

గతంలో ఏ అంశమైనా డీకే శివకుమార్‌కు డ్యామేజ్‌ అవుతుందంటే అధిష్ఠానంలో సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌లలో ఒకరు స్పందించేవారు. కానీ ప్రస్తుతం ఎవరూ స్పందించలేదు. ఇటీవలే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వ మార్పు విషయమై ఎవరూ మాట్లాడకుండా పనిచేసుకుపోవాలని సున్నితంగా మందలించారు. ఇప్పటిదాకా బగానే ఉన్నా ఎందుకో డీకే శివకుమార్‌కు ఒక్కసారిగా ఎవరూ సహకరించలేని పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజులుగా డీసీఎం, మూడు రోజులుగా సీఎం ఢిల్లీలోనే ఉన్నా దాదాపు ఎవరికి వారు అనేలా వ్యవహరించారు.


ఇక సిద్దరామయ్య నేనే ఐదేళ్లు సీఎం అనే వ్యాఖ్యల తర్వాత డీకే శివకుమార్‌ ఒక్కసారిగా మౌనం అయ్యారు. మూడు రోజులపాటు ఢిల్లీలో గడిపినా, రాహుల్‌గాంధీ ఢిల్లీలోనే ఉన్నా వీరికి అపాయింట్‌మెంట్‌ లభించలేదు. కానీ డీకే శివకుమార్‌, ప్రియాంక గాంధీని ప్రత్యేకంగా కలవడం సర్వత్రా కుతూహలం అనిపిస్తోంది. డీకే శివకుమార్‌ బెంగళూరుకు గురువారం రాత్రికే చేరుకున్నారు. డీకే సైలెంట్‌ గేమ్‌ ఆడేందుకు సిద్ధమయ్యారా..? అనే చర్చలు ఊపందుకుంటున్నాయి. సీఎం పవర్‌గేమ్‌కు సైలెంట్‌ అస్త్రం ప్రయోగించారని తెలుస్తోంది.


వేచి చూడాలనే ఆత్రుత పడరాదని కూడా భావిస్తున్నారు. మొత్తంగా అధిష్ఠానం ముందు వీలు చూసుకుని మాట్లాడాలనే ఆలోచన కూడా ఉంది. రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలతో చర్చలు జరపాలని అది హడావుడిగా చేసే ప్రక్రియ కాదని ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా ఉంది. శుక్రవారం కేపీసీసీలో జరిగిన కార్యక్రమంలో డీకే మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మౌనంగా ఉండాలని సూచించారని అది బాధ్యతతో సంతోషంగా స్వీకరిస్తున్నా అన్నారు. అన్ని వ్యాఖ్యలు విన్నానన్నారు. కాగా సీఎం సిద్దరామయ్య ఒక్కసారిగా నేనే ఐదేళ్లు సీఎం అనడం వెనుక రాహుల్‌గాంధీ అభయం ఉందా..? అనేది అంతుచిక్కని రహస్యంగా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి.

రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..

తెలంగాణలో అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇదే..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 12 , 2025 | 12:32 PM