DK Shivakumar: నాకు మరో దారి లేదు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 02 , 2025 | 03:36 PM
కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను సీఎంను చేయమని ఎవరినీ అడగలేదని, నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటన చేసే వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై జరుగుతున్న ఊహాగానాలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తెరదించారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) సైతం సిద్ధరామయ్యకు బాసటగా నిలుస్తానని, తనకు మరో దారి లేదని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి పదవి డీకే శివకుమార్‌కు అప్పగించాలంటూ ఆయన విధేయులు కొద్దికాలంగా చేస్తున్న డిమాండ్లకు సీఎం సిద్ధరామయ్య బుధవారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో చెక్ పెట్టారు. ఐదేళ్ల పాటు తాను ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.
మరో దారి లేదు: డీకే
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ మాట్లాడుతూ, తనను సీఎంను చేయమని ఎవరినీ అడగలేదని, నాయకత్వ మార్పు అంశంపై బహిరంగ ప్రకటన చేసే వారికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. 'ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తున్నారు. నాలాగే వందలాది మంది కష్టపడి పనిచేసే వాళ్లున్నారు. నేను ఒక్కడినే కాదు కదా. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు శ్రమిస్తున్నారు. వారి గురించి మనం ముందు ఆలోచించాలి' అని డీకే అన్నారు. సిద్ధరామయ్యకు అండగా నిలవడం మినహా తనకు మరో దారి లేదని వ్యాఖ్యానించారు. పార్టీ అధిష్ఠానం ఏది నిర్ణయించినా, ఏది చెప్పినా చేయడమే తన పని అని, దీనిపై మరింతగా మాట్లాడం సరికాదని చెప్పారు. సిద్ధరామయ్య నాయకత్వంపై పార్టీలో ఎలాంటి అసంతృప్తులు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు.
దీనికి ముందు, పార్టీ కోసం ఎంతో కష్టపడిన డీకేను ముఖ్యమంత్రిని చేయాలని సుమారు 100 మంది ఎమ్మెల్యేలు కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక మంత్రి కెఎస్ రాజన్న సైతం త్వరలోనే నాయకత్వ మార్పు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ రణదీప్ సూర్జేవాలా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన నాయకత్వ మార్పు లేదని, దానిపై చర్చ చరగలేదని మీడియా ముందు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం ఇష్టం లేని బీజేపీనే అనవసరమైన దుష్ప్రచారం చేస్తోందంటూ తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..
పార్లమెంటులో భద్రతా వైఫల్యం.. నిందితులకు బెయిల్
ప్రభుత్వ ఉద్యోగుల మ్యారేజ్ అలవెన్స్ పెంపు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి