RJD: ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:03 PM
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర కనిపిస్తోందని అఖ్తరుల్ అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యం లేని పదవిని ఇచ్చి నితీష్‌ను తప్పించాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు.

పాట్నా: ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా వెనుక బీజేపీ కుట్ర ఉందని రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సంచలన ఆరోపణ చేసింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ (Nitish Kumr)ను మార్చేందుకే ఇలా చేసినట్టు అసెంబ్లీలో ఆర్జేడీ చీఫ్ విప్ అఖ్తరుల్ ఇస్లామ్ షహీన్ అన్నారు.
మంగళవారంనాడిక్కడ మిడియాతో అఖ్తరుల్ మాట్లాడుతూ, చాలాకాలంగా నితీష్ కుమార్‌కు ఉద్వాసన చెప్పేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, ఒక దశలో నితీష్‌ను ఉప ప్రధానిని చేయాలని కేంద్ర మాజీ మంత్రి అశ్వినీకుమార్ చౌబే మాట్లాడారని గుర్తు చేశారు. ఈ దశలో జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేయడంలో బీజేపీ కుట్ర కనిపిస్తోందని అన్నారు. ఉపరాష్ట్రపతి వంటి రాజకీయ ప్రాధాన్యత లేని పదవిని ఇచ్చి నితీష్‌ను తప్పించాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు.
జేడీయూ ఖండన
కాగా, ఆర్జేడీ నేత చేసిన ఆరోపణలను జేడీయూ సీనియర్ నాయకుడు శరవణ్ కుమార్ తోసిపుచ్చారు. నితీష్ కుమార్ బిహార్‌ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఆయన ఇక్కడే ఉంటారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయానికి సారథ్యం వహిస్తారని, రాష్ట్ర ప్రజలకు మరో ఐదేళ్లు సేవలందిస్తారని చెప్పారు. జగదీప్ ధన్‌ఖడ్ వైద్య కారణాలను పేర్కొంటూ ఉపరాష్ట్రపతి పదవికి సోమవారం రాత్రి రాజీనామాచేసారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
ఇవి కూడా చదవండి..
వాళ్లెవరు, వాళ్ల హోదా ఏమిటి.. నిలదీసిన శశిథరూర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి