Dy CM: డిప్యూటీ సీఎం ఆగ్రహం.. భాష గురించి అడిగితే ఈడీతో దాడులా..
ABN , Publish Date - Mar 08 , 2025 | 12:46 PM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. భాష గురించి అడిగితే ఈడీతో దాడులు చేయిస్తారా.. అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక త్రిభాషా విధానంపై తాము నిలదీస్తున్నందుకే ఈడీతో దాడులు చేయిస్తున్నారని ఉదయనిధి వ్యాఖ్యానించారు.

- ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి
చెన్నై: త్రిభాషా విధానంపై తాము నిలదీస్తున్నందుకే ఈడీ దాడులు చేయిస్తున్నారని, రాష్ట్రంలో పెరుగుతున్న అసంతృప్తి దిశ మార్చేందుకు కూడా టాస్మాక్ కార్యాలయాలు, గోడౌన్లలో ఈడీ దాడులు జరుగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి(Deputy Chief Minister Udayanidhi) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, అందిస్తున్న సంక్షేమ సహాయాలపై ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరువారూరులో గురువారం పర్యటించిన ఆయన రాత్రి సన్నిధి వీధిలోని ఇంట్లో బసచేశారు. రెండో రోజైన శుక్రవారం తిరువారూరు మున్సిపల్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమావేశమై, శాఖల వారీగా చేపట్టిన కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Yogi Adityanath: అయోధ్య, ప్రయాగ్‌రాజ్ తర్వాత మథుర వంతు: యోగి కీలక ప్రకటన
ఈ సందర్భంగా ఉదయనిధి మీడియాతో మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేలా ముఖ్యమంత్రి స్టాలిన్ సూచన మేరకు నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటుచేశామన్నారు. ప్రస్తుతం ఈ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యల తెలుసుకుంటోందని, కమిటీ నివేదిక అనంతరం వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. త్రిభాషా విధానం అమలుచేయాలని నిర్బంధం, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, నిధుల కేటాయింపులో పక్షపాతం తదితరాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.
‘నీట్’కు వ్యతిరేకంగా డీఎంకే సంతకాల సేకరించిన సమయంలో విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారన్నారు. వీరిలో పాఠశాల విద్యార్థుల వద్ద సంతకాలు సేకరించలేదని తెలిపారు. ప్రస్తుతం త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ చేపట్టిన సంతకాల సేకరణకు పాఠశాల విద్యార్థులను కూడా బలవంతం చేస్తున్నారన్నారు. అలాంటి చర్యలు విడనాడాలని హితవు పలికారు. ఇప్పటికే బీజేపీ ‘మిస్ట్ కాల్’తో కోటి సభ్యులను చేర్చినట్లు ప్రకటించిందని, ప్రస్తుతం చేపట్టిన సంతకాల సేకరణ కూడా తాము అలాగే చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి తెలిపారు.
ఆరు గంటల్లోనే ఇల్లు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి...
తిరువారూరు జిల్లా పళవాంగుడి పంచాయతీలో మహిళా స్వయం సహాయక బృందాలతో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న గిరిజన కుటుంబాలకు చెందిన ఐదుగురు, ఇళ్లు, పట్టా కావాలని విజ్ఞప్తి చేశారు. దివ్యరాజా, నాగరాజ్ మురుగయ్యన్, స్టాలిన్ సౌందరరాజ్, సుకన్య తదితరులకు కలైంజర్ కనవు ఇల్లం పథకంలో ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్ధిక సాయం మంజూరు సంబంధించిన ఉత్తర్వులు, సుకన్య మేఘనాథన్ కు ఇంటి పట్టాను సాయంత్రం వారిళ్లకే వెళ్లి ఉప ముఖ్యమంత్రి అందజేశారు. సమస్య తెలిపిన ఆరు గంటల్లోనే స్పందించి తాము ఇళ్లు నిర్మించుకొనేందుకు ఆర్ధికసాయం, ఇంటి పట్టా అందజేసినందుకు వారు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలను కూడా చదవండి:
తుర్లపాటి రాజేశ్వరికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
హైదరాబాద్‌లో చిన్నారిపై వీధి కుక్కల దాడి
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News