DK Shivakumar: ఢిల్లీకి బయలుదేరిన డీకే.. ఏమన్నారంటే
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:43 PM
సీఎం సిద్ధారామయ్యతో పాల్గొనాల్సిన ఒక కార్యక్రమం కోసం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఉదయం మంగళూరు వచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే మద్దతుదారులు ఈ సందర్భంగా డీకే-డీకే అంటూ నినాదాలు చేశారు.
బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) బుధవారంనాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు వ్యవహారంపై ముందుగా కలిసి చర్చించుకోండంటూ కాంగ్రెస్ అధిష్ఠానం సూచించడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల పరస్పరం బ్రేక్‌ఫాస్ట్ ఆతిథ్యం ఇచ్చిపుచ్చుకోవడం జరిగాయి. ఇరువురు నేతలూ మీడియా ముందుకు వచ్చి తమ ఐక్యతను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటనకు బయలుదేరడం ఆసక్తికరమైంది. అయితే ఇదెలాంటి రాజకీయ పర్యటన కాదని బెంగళూరులో మీడియాకు డీకే తెలిపారు.
ఢిల్లీలో ఒక వివాహ కార్యక్రమానికి హాజరవుతున్నాననీ, రెండు మీటింగ్‌లు కూడా ఉంటాయని డిప్యూటీ సీఎం తెలిపారు. 'ఓట్ చోరీ'పై ఈనెల 14న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ర్యాలీ ఏర్పాట్లను కూడా తాను చూసుకోవాల్సి ఉందని చెప్పారు.
వేణుగోపాల్‌కు 'డీకే' నినాదాలతో స్వాగతం
కాగా, సీఎం సిద్ధారామయ్యతో పాల్గొనాల్సిన ఒక కార్యక్రమం కోసం ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ఉదయం మంగళూరు వచ్చారు. కేపీసీసీ అధ్యక్షుడు డీకే మద్దతుదారులు ఈ సందర్భంగా 'డీకే-డీకే' అంటూ నినాదాలు చేశారు. దీనిపై డీకేను మీడియా ప్రశ్నించినప్పుడు, కొందరు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేస్తారని, మరికొందరు డీకే-డీకే అని, ఇంకొందరు రాహుల్-రాహుల్ అని, సిద్ధు-సిద్ధు అని నినాదాలు చేస్తుంటారని, అందులో తప్పేమీ లేదని అన్నారు. జనం తమ ప్రేమాభిమానాలను చాటుకోవడం సహజమేనని తెలిపారు. మంగళూరులో కేసీ వేణుగోపాల్‌తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య సైతం.. అధిష్ఠానం పిలిస్తే ఢిల్లీకి వెళ్తానని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఎంసీడీ ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీదే పైచేయి.. రెండో ప్లేస్‌లో ఆప్
యాప్ ముందస్తు ఇన్‌స్టలేషన్ తప్పనిసరేం కాదు.. కేంద్రం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి