Rahul Second Ambedkar: రాహుల్ రెండో అంబేడ్కర్.. బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ABN , Publish Date - Jul 26 , 2025 | 07:55 PM
దేశ ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని రాహుల్ పేర్కొనడంపై ఉదిత్ రాజ్ మాట్లాడుతూ, చరిత్ర మళ్లీ మళ్లీ పురోగతికి అవకాశాలు ఇవ్వదని ఓబీసీలు ఆలోచించాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పిన విషయాలను వారు అనుసరించాలని, మద్దతు ఇవ్వాలని అన్నారు.

న్యూఢిల్లీ: ఓబీసీ (OBC) సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పూర్తిగా అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యానని, దానిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీ తల్కటోరా స్టేడియంలో చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాహుల్‌కు కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ మద్దతుగా నిలిచారు. ఓబీసీలకు 'రాహుల్ రెండో అంబేడ్కర్' అని ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఉదిత్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. రాహుల్‌ను రెండో అంబేడ్కర్‌గా అభివర్ణించడం దళితులను, సంఘ సంస్కర్త- రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడమేనని పేర్కొంది.
ఉదిత్ రాజ్ ఏమన్నారంటే..
దేశ ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రతీకలని రాహుల్ పేర్కొనడంపై ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. చరిత్ర మళ్లీమళ్లీ పురోగతికి అవకాశాలు ఇవ్వదని ఓబీసీలు ఆలోచించాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పిన విషయాలను వారు అనుసరించాలని, మద్దతు ఇవ్వాలని అన్నారు. ఓబీసీలు ఆ విధంగా చేస్తే వారికి రాహుల్ గాంధీ రెండో అంబేడ్కర్ అని నిరూపిస్తారని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఓబీసీ ఔట్రీచ్ కార్యక్రమం 'భగీదరి న్యాయ సమ్మేళన్'లో రాహుల్ శుక్రవారం నాడు మాట్లాడుతూ, 2004 నుంచి తాను రాజకీయాల్లో ఉంటున్నానని, అయితే ఓబీసీ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను తాను పూర్తిగా అర్థం చేసుకోవడంలో చారిత్రాత్మకంగా విఫలమయ్యానని అంగీకరించారు. వ్యవసాయ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా దేశ ఉత్పాదక శక్తికి ఓబీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నా వారికి తగిన గుర్తింపు, ప్రతిఫలం లభించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుల సర్వేతో రోల్ మోడల్‌గా నిలిచిందని ప్రశంసించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిచోటా ఇలాంటి సర్వేలను అమలు చేస్తుందన్నారు.
అంబేడ్కర్‌ను కాంగ్రెస్ ఎప్పుడూ గౌరవించలేదు: బీజేపీ
రాహుల్‌ను రెండో అంబేడ్కర్‌గా ఉదిత్ రాజ్ అభివర్ణించడంపై బీజేపీ ప్రతినిధి షెహజాబ్ పూనావాలా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ రెండో అంబేడ్కర్ గురించి మాట్లాడుతోందని, కానీ ఒరిజనల్ అంబేడ్కర్‌ను ఏనాడు గౌరవించలేదని విమర్శించారు. 'అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్ పార్టీ ఆయనను తమ పార్టీ ఐడెంటిటీగా చిత్రించాలని అనుకోవడం అంబేడ్కర్‌ను, దళితులను అవమానించడమే. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా చేసిందెవరు? జమ్మూకశ్మీర్‌లో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు కాకుండా చేసిందెవరు? ముస్లింల రిజర్వేషన్ గురించి మాట్లాడిందెవ్వరు? రిజర్వేషన్లు బ్యాడ్ అన్నది నెహ్రూ కాదా?' అని పూనావాలా ప్రశ్నించారు.
ఇప్పుడు వాళ్లు రెండో అంబేడ్కర్ కావాలనుకుంటున్నారని, నెహ్రూ, ఇందిరాగాంధీ లాగా కావాలని అనుకోవడం లేదన్నారు. దాని అర్ధం నెహ్రూ, ఇందిరా గాంధీ సరైన మార్గంలో నడవలేదని అంగీకరించినట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎప్పుడూ కుటుంబపాలనకే తహతహలాడుతుంటుందని ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి..
భారత సైన్యంలోకి ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్... రుద్ర
నితీష్‌కు మద్దతిచ్చినందుకు చింతిస్తున్నా... కేంద్ర మంత్రి నిప్పులు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి