Share News

Communist Leader Kerala: కమ్యూనిస్టు దిగ్గజం వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూత

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:39 AM

కేరళ మాజీ సీఎం, భారత కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజ నేతల్లో ఒకరైన వెలిక్కాకతు శంకరన్‌..

Communist Leader Kerala: కమ్యూనిస్టు దిగ్గజం వీఎస్‌ అచ్యుతానందన్‌ కన్నుమూత
Communist Leader Kerala

  • 101 ఏళ్ల సుదీర్ఘ జీవన ప్రస్థానం

  • సాధారణ నేపథ్యం నుంచి ఉన్నత శిఖరాలకు..

  • 82 ఏళ్ల వయసులో తొలిసారి సీఎంగా

  • అవినీతిని సహించని రాజీలేని వైఖరి.. సొంత పార్టీ నేతలపైనా విమర్శలు

  • ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్‌ సంతాపం

తిరువనంతపురం/హైదరాబాద్‌, జూలై 21(ఆంధ్రజ్యోతి): కేరళ మాజీ సీఎం, భారత కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజ నేతల్లో ఒకరైన వెలిక్కాకతు శంకరన్‌ అచ్యుతానందన్‌ తుదిశ్వాస విడిచారు. గత నెల 23వ తేదీన గుండెపోటుకు గురైన వీఎ్‌సను.. తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఐసీయూలో చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 101 ఏళ్లు. వీఎ్‌సగా ప్రసిద్ధినొందిన అచ్యుతానందన్‌.. కేరళలో అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతల్లో ఒకరిగా, రాజీ లేని సీపీఎం నాయకుడిగా పేరొందారు. వీఎస్‌ మరణం పట్ల ప్రధాని మోదీ, కేరళ సీఎం విజయన్‌ తదితరులు సంతాపం ప్రకటించారు. అతి సాధారణ నేపథ్యం నుంచి కేరళలోనే అతిపెద్ద మాస్‌ లీడర్‌గా వీఎస్‌ ఎదిగారని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ పేర్కొన్నారు. ఎఝవ సామాజిక వర్గానికి చెందిన (కల్లుగీత కార్మిక) కుటుంబంలో 1923 అక్టోబరు 20వ తేదీన అచ్యుతానందన్‌ జన్మించారు. ఆయనకు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి, 11 ఏళ్ల వయసులో తండ్రి మరణించారు. బాల్యంలోనే కష్టాలను ఈదుకుంటూ వచ్చిన వీఎస్‌.. 17 ఏళ్ల వయసులో సీపీఐలో చేరి.. పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1946లో ట్రావెన్‌కోర్‌లో జరిగిన సాయుధ తిరుగుబాటులో పాల్గొని, నాలుగేళ్లు జైలు శిక్షకు గురయ్యారు. 1964లో సీపీఐ నుంచి ఒక వర్గం చీలిపోయి సీపీఎంను ఏర్పాటు చేసింది. సీపీఎం వ్యవస్థాపక నేతల్లో వీఎస్‌ ఒకరు.


1965-2016 మధ్య కాలంలో కేరళ అసెంబ్లీకి ఏడు పర్యాయాలు వీఎస్‌ ప్రాతినిధ్యం వహించారు. అవినీతి, అక్రమాలు, అనైతికతను ఎంతమాత్రం సహించని వీఎస్‌.. తన సొంతపార్టీ నేతలను కూడా వదిలిపెట్టేవారు కాదు. 82 ఏళ్ల వయసులో తొలిసారిగా ఆయన సీఎం పదవిని చేపట్టారు. కాగా ఆర్థిక సంస్కరణలను వీఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించేవారు. కేరళలో కోకాకోలా ప్లాంట్‌ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆయన నడిపిన ఉద్యమం బాగా పేరొందింది. అచ్యుతానందన్‌ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని గడిపిన ఆయన చివరి వరకూ నమ్మిన సిద్ధాంతాలకు, ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేశారని అన్నారు. దేశ రాజకీయాల్లో మచ్చలేని మహానేత వీఎస్‌ అచ్యుతానందన్‌ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని తెలిపారు. వీఎస్‌ మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కమ్యూనిస్టు యోధుడిని కోల్పోయామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 05:39 AM