CM Stalin: మాది.. భక్తులు మెచ్చిన ప్రభుత్వం.. ఓర్వలేక ప్రతిపక్షాల విమర్శలు
ABN , Publish Date - Jul 03 , 2025 | 10:31 AM
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వ పాలన చూసి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మెచ్చుకుంటున్నారని, గతంలో లేని విధంగా మూడువేలకు పైగా సుప్రసిద్ధ ఆలయాలకు మహాకుంభాభిషేకాలను జరిపించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.

- సీఎం స్టాలిన్
చెన్నై: రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా ద్రావిడ తరహా డీఎంకే ప్రభుత్వ పాలన చూసి ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మెచ్చుకుంటున్నారని, గతంలో లేని విధంగా మూడువేలకు పైగా సుప్రసిద్ధ ఆలయాలకు మహాకుంభాభిషేకాలను జరిపించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) పేర్కొన్నారు. భక్తిపేరుతో కపటనాటకాలాడేవారు, ఆధ్మాత్మిక భావాలను కాపాడేది తామేనంటూ గొప్పలు చెప్పుకుంటున్న మతతత్త్వవాదులు డీఎంకే ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్న భక్తులను చూసి ఓర్వలేక పసలేని విమర్శలు చేస్తున్నారని, అలాంటివారి విమర్శలను పట్టించుకోనన్నారు.
స్థానిక రాజా అన్నామలైపురం కపాలీశ్వర కల్యాణమండపంలో దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 32 జంటలకు బుధవారం సామూహిక వివాహం జరిగింది. ఈ వేడుకలకు సీఎం స్టాలిన్ ముఖ్య అతిథిగా హజరైన నూతన వధూవరులకు సారె సామగ్రి అందజేసి, వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లలో తాను దేవాదాయ శాఖ నిర్వహించిన కార్యక్రమాల్లోనే అత్యధికంగా పాల్గొన్నానని, సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలే ఎక్కువన్నారు.
దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు చూపించే చొరవ, శ్రద్ధవల్లే ఆధ్మాత్మిక కార్యక్రమాలు గతం కంటే ఎక్కువగా జరుగుతున్నాయని ప్రశంసించారు. సుప్రసిద్ధ ఆలయాలన్నీ కళకళలాడుతున్నాయని, నైవేద్యం, దీపారాధనకు నోచుకోని ఎన్నో వేల ఆలయాలు ప్రస్తుతం మూడుపూటలా నైవేద్యం, పూజా కార్యక్రమాలు జరుపుతున్నామని చెప్పారు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3177 ఆలయాలకు కుంభాభిషేకాలు జరిపామని, కబ్జాకు గురైన 997 ఆలయాలకు సంబంధించిన రూ.7701కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నామని,
వెయ్యేళ్లనాటి ప్రాచీన ఆలయాలను వాటి ప్రాచీనత, సౌందర్యానికి భంగం కలుగని రీతిలో పునర్నిర్మించామని చెప్పారు. ఇదే రీతిలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిరుపేద జంటలకు ఉచిత వివాహాలు కూడా జరిపిస్తున్నామని తెలిపారు. ఇలా ఆధ్యాతికవాదులంతా మెచ్చుకునే ద్రావిడ తరహా డీఎంకే పాలన చూసి ఓర్వలేకనే భక్తిపేరుతో పగటి వేషం వేసుకునేవారంతా విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘సేవ చేయడమే నా విద్యుక్తధర్మం’ అంటూ తమిళభక్త శిఖామణి తిరునావుక్కరసర్ చెప్పినట్టు విమర్శలను పట్టించుకోకుండా ప్రజలకు నిరంతరం సేవలందించటమే తన ధర్మంగా ఆచరిస్తున్నానని స్టాలిన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పీకే శేఖర్‌బాబు, కేఎన్ నెహ్రూ, ఎం.సుబ్రమణ్యం, శివజ్ఞానబాల్యస్వామి, ఆది శివలింగాచార్య గురుస్వామి, మేయర్ ఆర్. ప్రియా, డిప్యూటీమేయర్ మహే్‌షకుమార్, శాసనసభ్యులు వేలు, తాయగం కవి, జే.కరుణానిధి, జోసెఫ్ సామువేల్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త సుకి శివం, రామసుబ్రమణ్యం, అదనపు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మణివాసన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News and National News