CM Stalin: సీఎం స్టాలిన్ ధ్వజం.. బీజేపీ గొంతుకగా ఈపీఎస్
ABN , Publish Date - Jul 11 , 2025 | 10:43 AM
మతవాద బీజేపీ గొంతుకగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు.

- తిరువారూర్‌లో సీఎం స్టాలిన్ ధ్వజం
చెన్నై: మతవాద బీజేపీ గొంతుకగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు. రెండ్రోజుల తిరువారూర్ జిల్లా పర్యటనకు వెళ్ళిన స్టాలిన్ బుధవారం పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గురువారం ఉదయం తిరువారూర్ కొత్త బస్‌స్టేషన్ సమీపంలోని ఎంఎ్‌సనగర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.73.74 కోట్ల తో పూర్తిచేసిన 1,234 పథకాలను ప్రారంభించి, రూ.172.18 కోట్ల 2,423 కొత్తపథకాలకు శంకుస్థాపన చేశారు.
తిరువారూర్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థలశాఖ ఆధ్వర్యంలో పలు భవనాలు, కార్యాలయాలు నిర్మించారు. అలాగే రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తిరుత్తరైపూండి ప్రభుత్వాసుపత్రిలో రూ.9 కోట్లతో నిర్మించిన అదనపు భవనం, మన్నార్గుడి ప్రభుత్వాసుపత్రిలో రూ.1.25 కోట్లతో నిర్మించిన జిల్లా ప్రజా ఆరోగ్యవైద్య ప్రయోగశాల, విజయపురం ప్రభుత్వ తల్లిశిశు సంక్షేమ ఆస్పత్రిలో రూ.6 కోట్లతో నిర్మించిన కొత్త వార్డులు, పలు ప్రాంతాల్లో పీహెచ్‌సీలు, నగరాభివృద్ధి కార్యాలయం, పాఠశాల విద్యాశాఖ, పశు సంవర్థకశాఖ, వ్యవసాయశాఖ, అటవీశాఖల ఆధ్వర్యంలో పూర్తిచేసిన కొత్తపథకాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు కేఎన్ నెహ్రూ, ఎంఆర్‌కే పన్నీర్ సెల్వం, చెళియన్, అన్బిల్ మహేష్, మెయ్యనాథన్, టీఆర్‌బీ రాజా, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ... స్వలాభాపేక్షతో పార్టీని ఈపీఎస్ బీజేపీకి తాకట్టుపెట్టారని, ఆయన రాష్ట్రాన్ని కాపాడుతానని ప్రజలకు హామీ ఇవ్వడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. దేవాదాయశాఖ నిధులను పాఠశాల, కళాశాల భవనాల నిర్మాణానికి మళ్లించడంపై ఈపీఎస్ ప్రభుత్వాన్ని తప్పుబట్టారని, బీజేపీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఇదివరకు లేనివిధంగా డీఎంకే ప్రభుత్వంలో హిందూదేవాదాయశాఖ వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిందని, వీటి గురించి ప్రస్థావించని ఈపీఎస్ ప్రజలను మభ్యపెట్టేవిధంగా కోవై పర్యటనలో మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించని అన్నాడీఎంకేకు ప్రజలే గుణపాఠం చెబుతారని సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
కమ్యూనిటీ హాస్టల్ పరిశీలన
తిరువారూర్‌లో ప్రభుత్వ కళాశాల కమ్యూనిటీ హాస్టల్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్ గురువారం పరిశీలించారు. ఆ భవనంలో కల్పించిన తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతుల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు కొరతలేకుండా చూసుకోవాలని, ముఖ్యంగా హాస్టల్ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరీక్షల సీజన్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని హాస్టల్ అధికారులకు సీఎం సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్.. పెరిగిన బంగారం ధరలు..
నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు
Read Latest Telangana News and National News