India Food Price Rise: ఆహార ధరలపై వాతావరణ మార్పుల ప్రభావం
ABN , Publish Date - Jul 26 , 2025 | 03:34 AM
అసాధారణమైన తీవ్రమైన వేడిగాలులు వంటి వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో గత ఏడాది ఆహారం ధరలు..

న్యూఢిల్లీ, జూలై 25: అసాధారణమైన తీవ్రమైన వేడిగాలులు వంటి వాతావరణ మార్పుల కారణంగా భారత్‌లో గత ఏడాది ఆహారం ధరలు భారీగా పెరిగాయని తాజా అధ్యయనం పేర్కొంది. 2024 రెండో త్రైమాసికంలో ఉల్లిపాయలు, బంగాళదుంపల ధరలు 80 శాతానికి పైగా పెరిగాయని తెలిపింది. బార్సిలోనా సూపర్ కంప్యూటింగ్ సెంటర్‌కు చెందిన మాక్సిమిలియన్ కోట్జ్ నేతృత్వంలో 2022-2024 మధ్య 18 దేశాల్లో అధ్యయనం నిర్వహించారు. ప్రతికూల వాతావరణం వలన విపరీతంగా పెరిగిన 16 రకాల ఆహారపు ధరలను పరిశోధకులు విశ్లేషించారు. చాలా వరకు సందర్భాల్లో 2020 కంటే ముందు నాటి ధరలను దాటేశాయని, గ్లోబల్ వార్మింగ్ బలంగా ప్రభావం చూపినట్లు అధ్యయనంలో వెల్లడైంది. ‘మే నెలలో వీచే వేడిగాలుల తర్వాత భారత్‌లో 2024 రెండో త్రైమాసికంలో ఉల్లి, బంగాళదుంపల ధరల 80 శాతానికి పైగా పెరిగాయి’ అని పరిశోధకులు పేర్కొన్నారు. 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది. భారత్‌లో మే నెలలో తీవ్రమైన వేడి.. పంట దిగుబడి, సరఫరా చైన్లపై ప్రభావం చూపింది. ఆహార ధరల పెరుగుదల కారణంగా పోషకాహార లోపం, దీర్ఘకాలిక వ్యాధులు వంటి ఆరోగ్య ప్రతికూలతలతో పాటు ఆర్థిక అసమానతలు పెరిగే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. కోట్జ్ మాట్లాడుతూ ఆహార ధరల పెరుగుదల కారణంగా ఆహార భద్రతపై, ప్రధానంగా అల్పాదాయ కుటుంబాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందన్నారు. ‘ధరలు పెరిగినప్పుడు, పేద కుటుంబాలు తక్కువ పోషకాలు కలిగిన, చౌకైన ఆహార పదార్థాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇలాంటి ఆహారాలు కేన్సర్, మదుమేహం, గుండె సంబంధిత వ్యాధులు వంటి అనేక ఆరోగ్య పరిస్థితులతో ముడిపడి ఉంటాయి’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News