Share News

Air India Plance Crash: తప్పుడు ప్రచారం తగదు.. పాశ్చాత్య మీడియాకు కేంద్ర మంత్రి చురకలు

ABN , Publish Date - Jul 20 , 2025 | 06:56 PM

జూన్ 12న జరిగిన ఘోర దుర్ఘటనపై వెస్ట్రన్ మీడియా ముఖ్యంగా పైలట్ల తప్పదమే కారణమన్న విధంగా కథనాలు వెలువరించింది. రెండు ఇంజన్లకూ వెళ్లే ఇంధనాన్ని కంట్రోల్ చేసే స్విచ్‌లను కెప్టెన్ ఆపేసినట్టు ఒక యూఎస్ అధికారిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది.

Air India Plance Crash: తప్పుడు ప్రచారం తగదు.. పాశ్చాత్య మీడియాకు కేంద్ర మంత్రి చురకలు

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై పాశ్చాత్య మీడియా కథనాలను కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు (K Rammohan Naidu) తప్పుపట్టారు. విమాన ప్రమాదంపై తుది నివేదిక రాకుండానే వ్యాఖ్యలు చేయడం మంచి పని కాదని సూచించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో హిండాన్ ఎయిర్‌పోర్ట్ నుంచి తొమ్మిది సిటీలకు ఇండిగో విమాన సర్వీసులను మంత్రి ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన తాజా వ్యాఖ్యలు చేశారు.


'ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేయవద్దని ఇప్పటికే పాశ్చాత్య మీడియా సంస్థలకు ఏఏఐబీ విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ స్వప్రయోజనాల కోసం తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఏఏఐబీపై నాకు నమ్మకం ఉంది. బ్లాక్ బాక్స్‌లోని సమాచారాన్ని డీకోడ్ చేయడంలో ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అసాధారణ ప్రతిభ చూపించింది. దర్యాప్తుపై తుది నివేదిక రాకుండా ఎవరూ ఎలాంటి నిర్దారణకు రావద్దు' అని మంత్రి పునరుద్ఘాటించారు.


జూన్ 12న జరిగిన ఘోర దుర్ఘటనపై పైలట్ల తప్పదమే ముఖ్య కారణమన్న విధంగా వెస్ట్రన్ మీడియా కథనాలు వెలువరించింది. రెండు ఇంజన్లకూ వెళ్లే ఇంధనాన్ని కంట్రోల్ చేసే స్విచ్‌లను కెప్టెన్ ఆపేసినట్టు ఒక యూఎస్ అధికారిని ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. అయితే, ఈ కథనాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తోసిపుచ్చింది. అంతర్జాతీయ మీడియాకు చెందిన కొందరు ఎలాంటి నిర్ధారణ లేకుండానే బాధ్యత లేని కథనాలు ప్రచురిస్తున్నారని, దర్యాప్తు కొనసాగుతుండగా ఇలాంటి కథనాలను వ్యాప్తి చేయడం సరికాదని పేర్కొంది. తుది నివేదిక వచ్చేంత వరకూ మీడియా సంస్థలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. బోయింగ్ 787-8 కుప్పకూలిన దుర్ఘటనలో విమానంలోని 241 మందితోపాటు కుప్పకూలిన ప్రదేశంలోని 19మంది మృతిచెందారు. భారతదేశ విమానయాన చరిత్రలోనే ఇది ఘోర దుర్ఘటనగా నిలిచింది.


ఇవి కూడా చదవండి..

మళ్లీ మా నాన్నే సీఎం

ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ప్రస్తావనెందుకు? కస్సుమన్న సిద్ధరామయ్య

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 20 , 2025 | 07:54 PM