Encounter: మళ్లీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులు మృతి
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:50 PM
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకు 2026, మార్చి 30వ తేదీని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లోపు దేశంలో మావోయిస్టులే లేకుండా చేస్తోంది.
రాయ్‌పూర్, నవంబర్ 16: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. తుమ్మలపాడ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారంటూ నిఘా వర్గాల నుంచి సమాచారం అందిందన్నారు. దాంతో స్థానిక పోలీసులతోపాటు భద్రతా బలగాలు.. ఆ ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేపట్టాయని వివరించారు. ఈ విషయాన్ని మావోయిస్టులు గమనించి.. కూంబింగ్ నిర్వహిస్తున్న వీరిపై కాల్పులకు తెగబడ్డారన్నారు. దాంతో భద్రతా బలగాలతోపాటు పోలీసులు ఎదురు కాల్పులకు దిగారని.. దీంతో ఇరు వైపులా హోరాహోరీగా కాల్పులు జరిగాయని వివరించారు.
అనంతరం మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు ఆగిపోయాయని తెలిపారు. దాంతో ఆ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పలువురు మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. ఇక మృతి చెందిన మావోయిస్టులపై రూ. 15 లక్షల రివార్డు ఉందని తెలిపారు.
2026, మార్చి 30వ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఆ క్రమంలో ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారీగా మావోయిస్టులు మృతి చెందారు. అలాగే పలువురు మావోయిస్టులు ఇప్పటికే ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. ఆ జాబితాలో అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాలు, కిషన్ జీ భార్య తదితరులు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయి.. ప్రభుత్వానికి ఆయుధాలు అందజేశారు.
అలాగే చత్తీస్‌గఢ్ సీఎం ఎదుట ఆశన్న తోపాటు వందలాది మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరోవైపు మరికొంత మంది మావోయిస్టులు లొంగిపోకుండా.. ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలో తాజాగా సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగి.. ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు లొంగిపోయి.. జన జీవన స్రవంతిలో కలిసిపోవాలంటూ ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
కుటుంబంలో కలహాలు తొలగాలంటే.. ఈ రోజు..
మాస్టార్‌ని ఆకాశానికెత్తిన నారా లోకేష్
For More National News And Telugu News