Girl Sucide at CG: ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక బాలిక సూసైడ్.!
ABN , Publish Date - Nov 25 , 2025 | 09:49 AM
విద్యాబుద్ధులు నేర్పిస్తూ విద్యార్థుల జీవితానికి మార్గదర్శిగా ఉండాల్సిన ఓ ప్రిన్సిపాల్.. విద్యార్థిని బలవన్మరణానికి కారణమయ్యాడు. ఆయన వేధింపులు తాళలేక ఆ బాలిక పాఠశాల ఆవరణలోనే..
ఇంటర్నెట్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో అమానవీయ ఘటన వెలుగు చూసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానాచార్యుడే ఓ బాలికపై వేధింపులకు పాల్పడ్డాడు. ఆయన వేధింపులు తాళలేక చివరకు ఆ అమ్మాయి.. పాఠశాల ఆవరణలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణ చేపట్టారు అక్కడి అధికారులు.
ఇదీ జరిగింది..
జష్‌పూర్ జిల్లా బాగిచా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. 15 ఏళ్ల ఆ అమ్మాయి.. తనను ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆదివారం సాయంత్రం స్కూల్లోని స్టడీ రూమ్‌లో సీలింగ్ రార్డ్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రిన్సిపాల్ కుల్దీపన్ టోప్నో వేధింపులే తన చావుకు కారణమని ఆమె సూసైడ్ నోట్‌లో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సదరు ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు.
అయితే.. ఆ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌ను అనధికారికంగా నిర్వహిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధిత బాలిక సుర్గుజా జిల్లా సీతాపూర్ ప్రాంతానికి చెందిన వారని జష్‌పూర్ ఎస్పీ శశిమోహన్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై విద్య, గిరిజన, పోలీస్ శాఖల అధికారులతో కూడిన సంయుక్త బృందం పాఠశాలలో విచారణ చేపట్టింది. 6-12 తరగతులకు చెందిన 124మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదువుతుండగా.. వారిలో 22 మంది బాలురు, 11 మంది బాలికలు హాస్టల్లో ఉంటున్నారని గిరిజన శాఖ అసిస్టెంట్ కమిషనర్ సంజయ్ సింగ్ వివరించారు.
అయితే.. హాస్టల్ నిర్వహణకు అవసరమైన అనుమతులేవీ లేవని తేలగా.. పాఠశాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్టు బాగిచా సబ్-డివిజన్ మేజిస్ట్రేట్ ప్రదీప్ రథియా తెలిపారు. ఆ దర్యాప్తులో అన్నీ నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: