Smoke in Mumbai Metro: ముంబై మెట్రో కోచ్‌లో పొగలు.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
ABN , Publish Date - Jun 25 , 2025 | 02:52 PM
మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డుపై బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. అదే సమయంలో మెట్రో రైలు ఆగడం, తలుపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పొగలు కోచ్‌లోకి ప్రవేశించాయి.

ముంబై: మెట్రో కోచ్‌లోకి దట్టమైన పొగ రావడంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక దగ్గుతో విలవిల్లాడారు. ముఖాలకు అందుబాటులో ఉన్న క్లాత్‌లు, మాస్క్‌లు అడ్డుపెట్టుకున్నారు. ఏం జరుగుతోందో తెలియని అయోమయం, గందరగోళం చెలరేగింది. ముంబై బోరివలి ఏరియాలోని దేవిపద మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై ఒక ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకోవడం, అదే సమయంలో దేవిపద మెట్రో స్టేషన్‌లో రైలు ఆగడంతో పొగలు ఒక్కసారిగా కోచ్‌లోకి ప్రవేశించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సంఘటన వివరాల ప్రకారం, దేవిపద మెట్రో స్టేషన్‌కు పక్కనే ఆపి ఉన్న ఖాళీ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. దీంతో మెట్రో సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను చల్లార్చడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే, మెట్రో స్టేషన్ కిందనున్న రోడ్డుపై బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో దట్టమైన పొగలు వెలువడ్డాయి. అదే సమయంలో మెట్రో రైలు ఆగడం, తలుపులు తెరుచుకోవడంతో ఒక్కసారిగా పొగలు కోచ్‌లోకి ప్రవేశించాయి. యోగేష్ నామ్‌జోషి అనే ప్రయాణికుడు ఇందుకు సంబంధించిన 50 సెకన్ల వీడియోను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశాడు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు వీడియోను ట్యాగ్ చేశాడు.
ముంబై మెట్రో స్పందన
ఈ ఘటనపై మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విచారం వ్యక్తం చేసింది. రైలులో అగ్నిప్రమాదం కానీ, ప్రమాదం కానీ జరగలేదని తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
రైలు ప్రయాణీకులకు షాక్.. జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ఛార్జీలు..! ఎంతంటే..?
భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
For National News And Telugu News