Central Government Opposes: వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వొద్దు
ABN , Publish Date - Apr 26 , 2025 | 05:15 AM
వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వొద్దని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది

వక్ఫ్ ఆస్తుల నమోదుపై స్టే ఇచ్చినా ఇబ్బందే
ఇస్తే న్యాయ వ్యవస్థే చట్టం చేసినట్లవుతుంది
పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగబద్ధమే
సుప్రీంలో కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: సవరించిన వక్ఫ్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. దానిపై పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ స్టే విధించాలన్న ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించింది. పార్లమెంటు ఆమోదించిన చట్టం కనుక రాజ్యాంగ ధర్మాసనం భిన్నమైన తీర్పు ఇచ్చేవరకు ఆ చట్టాన్ని రాజ్యాంగ బద్ధంగానే రూపొందించి ఉంటారని భావించాలని చెప్పింది. పిటిషనర్లు దురుద్దేశపూరితమైన తప్పుడు వాదనలను ముందుకు తెచ్చారని వ్యాఖ్యానించింది. వాటిని కోర్టు పరిశీలిస్తున్న దశలో స్టే విధించరాదని కోరింది. రేపు ఆ పిటిషన్లు కొట్టివేసిన తర్వాత ఏ కమ్యూనిటీ తరఫున పిటిషన్లు వేశామంటున్నారో ఆ కమ్యూనిటీయే స్టే వల్ల వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని, ఇది అవాంఛనీయ పరిస్థితని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తన వాదనను అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. 1332 పేజీల ప్రాథమిక కౌంటర్ అఫిడవిట్‌లో ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని గట్టిగా సమర్థించుకుంది.
2013 వక్ఫ్ చట్టం తర్వాత దాదాపు 21 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ జాబితాలో తాజాగా చేరిందని ప్రస్తావించింది. మొఘలుల కాలం నుంచి స్వతంత్య్రం వచ్చినప్పటి వరకు ఉన్న వక్ఫ్ భూములన్నీ కలిపి 18.29 లక్షల ఎకరాలు మాత్రమేనని వెల్లడించింది. గత చట్టంలోని నిబంధనలను అవకాశంగా చేసుకొని ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నట్లు పేర్కొంది. మైనారిటీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి షేర్షా సీ షేక్ మొహినుద్దీన్ పేరిట అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సాధారణంగా తుది తీర్పు ఇచ్చేవరకు రాజ్యాంగ ధర్మాసనాలు పార్లమెంటు ఆమోదించిన చట్టాలపై స్టే విధించవని గుర్తు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వక్ఫ్ బిల్లుపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలన్న విజ్ఞప్తిపై మే 5న విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్టే ఆలోచన వద్దని సుప్రీంకోర్టును కోరింది. ఏప్రిల్ 8వ తేదీలోగా వక్ఫ్ బై యూజర్ ఆస్తులను నమోదు చేసుకోవాలని చట్టంలో ఉన్న నిబంధనపైనా నియంత్రణలు విధించాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. దానిపై ఎలాంటి స్టే విధించినా న్యాయస్థానం ఆదేశాలతో చట్టం చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది.
కొత్త చట్టంతో కేంద్ర, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో ముస్లిములు మైనారిటీలు అవుతారన్న పిటిషనర్ల వాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. సెంట్రల్ వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యుల్లో కేవలం నలుగురు ముస్లిమేతరులు ఉంటారని, దానివల్ల ముస్లిం మెజారిటీకి ఎలాంటి భంగం కలగదని పేర్కొంది. వక్ఫ్ బై యూజర్ ఇప్పటిదాకా భూమిని రిజిస్టర్ చేసుకోలేదన్న వాదనను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇప్పుడు ఈ విషయంలో సుప్రీంకోర్టు కనుక స్టే ఇస్తే చాలా తేడాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం లక్ష్యమే నెరవేరకుండా పోతుందని వ్యాఖ్యానించింది. రాజ్యాంగబద్ధంగా భావిస్తున్న ఒక చట్టాన్ని మార్చాలన్న ప్రతిపాదనను అనుమతించరాదని స్పష్టం చేసింది. న్యాయసమీక్ష కూడా ఒక రాజ్యాంగబద్ధ చట్టాన్ని ఆపకూడదని వ్యాఖ్యానించింది. పిటిషనర్లు కోరిన వాటికి అనుకూలంగా ఏ ఉత్తర్వు ఇచ్చినా మొత్తం చట్టంపై స్టే ఇచ్చినట్లేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది. కొత్త చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తుల గుర్తింపు, నియంత్రణకు న్యాయస్థానాల ప్రామాణికత వస్తుందని వ్యాఖ్యానించింది. ఆస్తి హక్కు విషయంలో ఏ వ్యక్తీ కోర్టుకు వెళ్లలేని పరిస్థితి ఉండకూడదని ఈ మార్పులు చేసినట్లు తెలిపింది. ఈ చట్టంతో ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందన్న వాదనను కూడా కేంద్రం ఖండించింది. ముస్లింల మతాచారాలను గౌరవిస్తూ చట్టాన్ని రూపొందించామని, విశ్వాసం, ప్రార్థన లాంటి అంశాల జోలికి పోలేదని, వక్ఫ్ నిర్వహణలో లౌకిక అంశాలపైనే చట్టం చేశామని వివరించింది.