Kishan Reddy: చేసిన తప్పులకు చెంపలేసుకోవాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:18 PM
Kishan Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. నెహ్రు కుటుంబం దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు. అంతేకాని ఆ కుటుంబం దేశానికి చేసింది ఏమీల లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని.. వాటిలో ఇది ఒకటి అని ఆయన గుర్తు చేశారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేంద్ర బోగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. బుధవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హయాంలో బొగ్గు, హెలికాఫ్టర్, బోఫోర్స్ కుంభకోణాలు లాంటివి ఎన్నో జరిగాయన్నారు. ఆ క్రమంలో జరిగిన మరో పెద్ద కుంభకోణమే నేషనల్ హెరాల్డ్ అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు నేషనల్ హెరాల్డ్ స్థాపిస్తే.. దానిని దొడ్డి దారిన సోనియా, రాహుల్ గాంధీలకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీకి తరలించారని విమర్శించారు.
ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడం సిగ్గు మాలిన చర్య అని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు. నెహ్రూ కుటుంబం దేశాన్ని లూటీ చేసిందని.. అంతేకానీ.. దేశానికి ఆ కుటుంబం ఏం చేయలేదని ఆయన మండిపడ్డారు. ఆ క్రమంలో దేశాన్ని అవినీతిమయంగా మార్చిన విషయం మనం చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ హెరాల్డ్ కేసు వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
2012లో నేషనల్ హెరాల్డ్ ఆస్తులపై దర్యాప్తు జరపాలంటూ సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారన్నారు. అందులోభాగంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై ఆయన కేసు వేశారని తెలిపారు . అయినా.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ధర్నాలు చేస్తుందని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వీరికి భయపడి కేసులు వెనక్కి తీసుకోవాలా? అని పార్టీని సూటిగా ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతం దర్యాప్తు జరపాలని చెప్పిందని గుర్తు చేశారు.
చేసిన తప్పులకు చెంపలు వేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఆయన సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించడంతోపాటు ఈడి కార్యాలయాల ముందు ధర్నా చేయడం మానుకోవాలని వారికి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ చేసిన కుంభకోణాలను ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని, సుప్రీంకోర్టు, హైకోర్టును తప్పుపట్టడమేనని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కేసులు ఎందుకు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆయన డిమాండ్ చేశారు. చట్టానికి వీరేమైనా చుట్టాలా అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఎందుకు ధర్నా చేస్తున్నారంటూ మండిపడ్డారు. తప్పు జరగలేదని కాంగ్రెస్ పార్టీ భూకయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు కొట్టేయాలంటూ సుప్రీంకోర్టు,హైకోర్టు ఎందుకు వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. ఇలా వెళ్లడం రాజ్యాంగబద్ధమైన సంస్థలను అవహేళన చేయడమేనని పేర్కొన్నారు. సోనియా, రాహుల్ గాంధీలు దేశం కోసం చేసిన పనులు కావన్నారు. వీరు బహిరంగ అవినీతికి పాల్పడ్డారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఛార్జిషీట్‌లో ఈడీ పెట్టింది. ఈ కేసును ఏప్రిల్ 25వ తేదీన విచారణ జరపనున్నట్లు ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇదే కేసులో ప్రియాంక గాందీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటలకే సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్‌లో ఈడీ చేర్చడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
Name Change: మీకు.. మీ పేరు నచ్చలేదా.. ఇలా చేస్తే.. వెంటనే మారుతోంది
Mark Shankar: మార్క్ శంకర్‌పై అసభ్యకర పోస్టులు.. ఒకరు అరెస్ట్
Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు..
Kakani Govardhan Reddy : కాకాణికి దెబ్బ మీద దెబ్బ
For National News And Telugu News