Blood Money: నర్సు నిమిషను రక్షించడానికి..
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:24 AM
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ 38 ను కాపాడేందుకు హత్యాపరిహార ధనం

‘బ్లడ్ మనీ’ ఒక్కటే మార్గం
రేపే యెమెన్‌లో నర్సు నిమిష ప్రియకు ఉరి
సుప్రీంకు ‘సేవ్ నిమిష కౌన్సిల్’ నివేదన
ఎవరి ద్వారా మాట్లాడాలన్నదే ప్రశ్న: కేంద్రం
న్యూఢిల్లీ, జూలై 14: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ (38)ను కాపాడేందుకు హత్యాపరిహార ధనం (బ్లడ్ మనీ) చెల్లించడం ఒక్కటే ఏకైక పరిష్కారమని ‘సేవ్ నిమిష ప్రియ-ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ అనే సంస్థ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఆమె తల్లి ప్రస్తుతం యెమెన్‌లోనే ఉన్నారని.. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులతో ఓ సామాజిక కార్యకర్త ద్వారా మాట్లాడుతున్నారని వెల్లడించింది. పరిహార ధనం తీసుకోవడానికి హతుడి కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే నిమిష బయటపడే అవకాశం ఉంటుందని తెలిపింది. అయితే బ్లడ్ మనీ చెల్లింపు ప్రైవేటుగా జరగాల్సిన వ్యవహారమని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి అన్నారు. ఆ డబ్బు తాము ఏర్పాటు చేసుకుంటామని నిమిష కుటుంబ సభ్యులు చెబుతున్నారని.. అయితే ఎవరితో మాట్లాడాలన్నదే ఇక్కడ ప్రశ్న అని తెలిపారు. ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వపరంగా చేయగలిగింది చాలా తక్కువని.. అయినా ఆమెను కాపాడేందుకు సాధ్యమైన మేర అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. బుధవారం నిమిషకు మరణ దండన అమలు కానున్న సంగతి తెలిసిందే. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన నిమిష.. 2017లో తన యెమెనీ వ్యాపార భాగస్వామిని హత్య చేశారన్న అభియోగాలపై 2020లో అక్కడ ఆమెకు మరణశిక్ష విధించారు. ప్రస్తుతం నిమిష ఆ దేశ రాజధాని సనాలోని జైలులో ఉన్నారు. ఆమెను రక్షించడానికి దౌత్య మార్గాల్లో కృషిచేయాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ‘సేవ్ నిమిష ప్రియ-ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్’ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ హాజరయ్యారు.
యెమెన్ ప్రస్తుతం హౌతీల పాలనలో ఉందని.. ఆ ప్రభుత్వాన్ని ఎవరూ దౌత్యపరంగా గుర్తించడం లేదని ఆయన తెలిపారు. మరణశిక్ష అమలును కొంతకాలం సస్పెండ్ చేయడానికి వీలుందో లేదో కనుక్కునేందుకు ఆ ప్రాంత పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు కేంద్రం ఇటీవల లేఖ రాసిందని తెలిపారు. సాధ్యమైన అన్ని యత్నాలూ చేస్తున్నామని.. అక్కడ పలుకుబడి కలిగిన కొందరు షేక్‌లను కూడా రంగంలోకి దించామని వివరించారు.
2008లో యెమెన్‌కు..
నిమిష 2008లో యెమెన్ వెళ్లారు. రాజధాని సనాలో సొంత క్లినిక్ ఏర్పాటుచేసేందుకు 2015లో ఆ దేశస్థుడైన తలాల్ అబ్దో మహదీ సాయం తీసుకున్నారు. ఆ ఏడాది నిమిష నెల రోజుల సెలవుపై కేరళ వచ్చినప్పుడు మహదీ కూడా ఆమెతోపాటు వచ్చారు. ఆ తర్వాత అతడితో ఆమెకు విభేదాలు వచ్చాయి. తన పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోవడానికి 2017లో అతడికి నిమిష మత్తు ఇంజక్షన్ ఇచ్చిందని.. ఓవర్‌డో్‌సతో అతడు మరణించాడని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిమిష మరో నర్సు సాయంతో మృతదేహాన్ని ముక్కలుచేసి భూగర్భ ట్యాంకులో పడేసినట్లు యెమెనీ కోర్టు అధికారిక పత్రాలు చెబుతున్నాయి. దేశం వదిలి పారిపోతుండగా ఆమెను పట్టుకున్నారు. ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. కాగా, నిమిష ప్రియను కాపాడేందుకు కేరళకు చెందిన సున్నీ ముస్లింల మతగురువు షేక్ అబూబకర్ అహ్మద్ ముస్లియార్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ‘ఇండియా గ్రాండ్ ముఫ్తీ’ బిరుదు ఉన్న 94 ఏళ్ల అబూబకర్ యెమన్‌లో మతాధికారులతో చర్చించారు.