Maharashtra: ఆ జిల్లాలో రొట్టెల వల్లే బట్టతల!
ABN , Publish Date - Feb 27 , 2025 | 05:42 AM
మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా వాసులకు ఈ మధ్య ఈ విచిత్ర సమస్య ఎదురైంది. దాదాపు 300 మంది.. వారిలో చాలామంది యువతీ యువకుల్లో అకస్మాత్తుగా జుట్టు ఊడటం మొదలైంది.

మహారాష్ట్రలోని బుల్ధానాలో 300 మందికి వారాల వ్యవధిలో బట్టతల
వారు వాడే గోధుమపిండిలో అధిక మోతాదులో సెలీనియం.. అదే సమస్య
ముంబై, ఫిబ్రవరి 26: మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లా వాసులకు ఈ మధ్య ఈ విచిత్ర సమస్య ఎదురైంది. దాదాపు 300 మంది.. వారిలో చాలామంది యువతీ యువకుల్లో అకస్మాత్తుగా జుట్టు ఊడటం మొదలైంది. చూస్తుండగానే బట్టతల వచ్చేసింది. దీంతో పలువురు కాలేజీ విద్యార్థులు, యువతులు ఇల్లు దాటి బయటకు వెళ్లలేదు. ఈ సమస్యపై ఎంతోమంది డాక్టర్లను సంప్రదించినా వారు తగిన పరిష్కారం చూపలేకపోయారు. చివరికి, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన వైద్యుడు హిమ్మత్‌రావ్ బవాస్కర్.. దీని గురించి పరిశోధించి.. బల్ధానా జిల్లా వాసులు రొట్టెల తయారీకి వాడుతున్న గోధుమ పిండిలో సమస్య ఉందని గుర్తించారు.
సదరు గోధుమ పిండిలో సిలీనియం అధికస్థాయిలో ఉంటోందని, దాని వల్లే అలోపిసియా అనే సమస్య తలెత్తి వెంట్రుకలు ఊడటం మొదలైందని తేల్చారు. పంజాబ్, హరియాణాల నుంచి సరఫరా అయిన ఆ గోధుమపిండిని బల్ధానాలో రేషన్‌షాపుల ద్వారా పంపిణీ చేశారు. సాధారణంగా పర్వతప్రాంతాల్లోని నేలల్లో సిలీనియం అధికస్థాయిలో ఉంటుంది. పంజాబ్, హరియాణాల్లో విస్తరించిన శివాలిక్ పర్వతశ్రేణుల్లో కూడా ఇది సహజం. వర్షాకాలంలో ఈ సిలీనియం నీటిలో కలిసి పంటభూములకు చేరినప్పుడు.. పండించే పంటల్లో కూడా ఎక్కువ మోతాదులో కనిపిస్తుంది. అంతేగాక, ఫాస్ఫేట్ ఎరువులతోనూ సిలీనియం సమస్య పెరుగుతుంది. వాస్తవానికి మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి సిలీనియం అవసరం. కానీ, మోతాదు మించితే జుట్టు ఊడటం, చర్మ సమస్యలు వంటివి తలెత్తుతాయి.