Bengal Raj Bhavan: ఆయుధ నిల్వల ఆరోపణలపై బెంగాల్ రాజ్‌భవన్‌లో తనిఖీలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:59 PM
కోల్‌కతా పోలీసులు, రాజ్‌భవన్ పోలీస్ ఔట్‌పోస్ట్, సీఆర్‌పీఎఫ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా రాజ్‌భవన్‌లో గాలింపు చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారని గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ (West Bengal)లోని రాజ్‌భవన్ (Raj Bhavan) ప్రాంగణంలో కేంద్ర బలగాలు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో సోమవారంనాడు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ (CV Ananda Bose)ఈ టీమ్‌లకు నేతృత్వం వహించారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో ఆయుధాలు నిల్వ చేశారని, క్రిమినల్స్‌కు ఆశ్రయం కల్పించారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) తీవ్ర ఆరోపణలు చేయడంతో ఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
కోల్‌కతా పోలీసులు, రాజ్‌భవన్ పోలీస్ ఔట్‌పోస్ట్, సీఆర్‌పీఎఫ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సంయుక్తంగా రాజ్‌భవన్‌లో గాలింపు చర్యలు చేపట్టడం ఇదే మొదటిసారని గవర్నర్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యగా రాజ్‌భవన్ భవంతిని పూర్తిగా ఖాళీ చేయించారు. నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్, సివిల్ ఢిపెన్స్ టీమ్‌లను కూడా రప్పించారు. ఫైర్‌ఫైటింగ్ డ్రిల్స్ నిర్వహించారు.
ఎంపీపై చట్టపరమైన చర్యలు
టీఎంసీ ఎంపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని నిరూపించేందుకే సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చిందని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని గవర్నర్ సి ఆనంద్‌బోస్ తెలిపారు. 'ఎవరైనా ఇక్కడ బాంబులు దాచారా? ఆయన ఎప్పుడు ఈ ప్రాంతాన్ని గాలించారు?' అని మండిపడ్డారు.
వివాదం ఇలా..
బెంగాల్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎంతో అవసరమని గవర్నర్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో కల్యాణ్ బెనర్జీ గవర్నర్‌పై గత శనివారంనాడు విమర్శల దాడి చేశారు. గవర్నర్ రాజ్‌భవన్‌లో బీజేపీ నేరస్థులకు ఆశ్రయం ఇవ్వలేదని మొదట చెప్పాలన్నారు. నేరస్థులకు ఆశ్రయం కల్పించి వారికి బాంబులు, తుపాకులు సమకూరుస్తున్నారని, తృణమూల్ కార్యకర్తలపై దాడులు చేయాలని చెబుతున్నారని, ముందు ఆయన వీటిని ఆపాలని తీవ్ర ఆరోపణలు చేశారు. గవర్నర్ పదవికి ఆయన తగరని, ఆయన బీజేపీ సర్వెంట్ గవర్నర్ అని అభివర్ణించారు.
రాజ్‌భవన్ ఖండన
కల్యాణ్ బెనర్జీ ఆరోపణలను రాజ్‌భవన్ వెంటనే ఖండించింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి నిల్వను నిర్ధారించేందుకు 100 మంది పౌరసమాజం సభ్యులు, మీడియా సిబ్బందిని తీసుకుని రాజ్‌భవన్‌కు బెనర్జీ రావాలని సవాలు చేసింది. తన వ్యాఖ్యలపై ఎంపీ క్షమాపణ చెప్పాలని, లేదంటే తప్పుడు ఆరోపణలతో విద్వేష ప్రసంగం చేసినందుకు ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న గవర్నర్ తన పర్యటనను కుదించుకుని రాజ్‌భవన్‌కు తిరిగి వచ్చారు.
ఇవి కూడా చదవండి..
10 రోజుల ఎన్ఐఏ కస్టడీకి ఢిల్లీ పేలుడు ఘటన నిందితుడు
88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.