Rahul Vs Rohan Jailtley: అరుణ్ జైట్లీపై రాహుల్ వ్యాఖ్యలు.. కస్సుమన్న రోహన్ జైట్లీ
ABN , Publish Date - Aug 02 , 2025 | 06:30 PM
లీగల్ కాంక్లేవ్ 2025లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అరుణ్ జైట్లీ తనను బెదిరించినట్టు రాహుల్ తెలిపారు. ఆయన వాఖ్యలను రోహన్ జైట్లీ వెంటనే ఖండించారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), బీజేపీ దివంగత నేత అరుణ్ జైట్లీ (Arun Jaitley) తనయుడు రోహన్ జైట్లీ (Rohan Jaitley) మధ్య మాటల యుద్ధం నెలకొంది. తొలుత అరుణ్ జైట్లీపై రాహుల్ వ్యాఖ్యలు చేయగా.. రాహుల్ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని రోహన్ సమధానమిచ్చారు. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ సైతం తప్పుపట్టింది.
వివాదం ఇలా..?
లీగల్ కాంక్లేవ్ 2025లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసలు చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అరుణ్ జైట్లీ తనను బెదిరించినట్టు రాహుల్ తెలిపారు. 'వ్యవసాయ చట్టాల గురించి నేను పోరాడుతున్నప్పుడు జరిగిన విషయం ఒకటి నాకు గుర్తుంది. మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవసాయ చట్టాలపై పోరాడితే మీపై మేము చర్యలు తీసుకుంటామని అరుణ్ జైట్లీ నన్ను బెదిరించారు. అందుకు నేను.. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియదని అనుకోవడం లేదని సమధానమిచ్చాను' అని రాహుల్ తెలిపారు.
రాహుల్ వ్యాఖ్యలను రోహన్ జైట్లీ వెంటనే ఖండించారు. తన తండ్రి మరణం, వ్యవసాయ చట్టాల వివాదానికి సంబంధించిన టైమ్‌లైన్‌ను ఆయన ప్రస్తావించారు. విపక్షాలను బెదిరించడం తన తండ్రికి అలవాటు లేదని, బహిరంగ చర్చలకే ఆయన ఎల్లపుడూ ప్రాధాన్యమిచ్చేవారని అన్నారు. 'మా తండ్రి దివంగత అరుణ్ జైట్లీ వ్యవసాయ చట్టాలపై నన్ను బెదిరించారని రాహుల్ చెబుతున్నారు. మా తండ్రి 2019లో కన్నుమూశారు. వ్యవసాయ చట్టాలు 2020లో ప్రవేశపెట్టారు. అంతకంటే కీలక విషయం ఏమిటంటే మా తండ్రి దృఢమైన ప్రజాస్వామ్యవాది. ఏకాభిప్రాయసాధనకే ఆయన కృషి చేసేవారు. రాజకీయాల్లో అడపాదడపా సంక్లిష్ట పరిస్థితులు వస్తే అందరికీ ఆమోదయోగ్యమైన ఏకాభిప్రాయ సాధన కోసం స్వేచ్ఛగా, బహిరంగ చర్చకు ఆయన ఆహ్వానించేవారు' అని అన్నారు. చనిపోయిన వారి గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ ఆలోచించి మాట్లాడాలని రోహన్ జైట్లీ హితవు పలికారు. 'మనోహర్ పారికర్ విషయంలోనూ ఆయన (రాహుల్) ఇలానే మాట్లాడారు. పారికర్ చివరి రోజులను రాజకీయం చేస్తూ ఆయన మాట్లాడటం ఉత్తమాభిరుచి అనిపించుకోదు. దివంగత నేతల ఆత్మశాంతిని కాపాడాల్సి బాధ్యత మనకుంది' అని రోహన్ అన్నారు.
బీజేపీ మండిపాటు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ మండిపడ్డారు. అరుణ్ జైట్లీ రాహుల్‌ను అప్రోచ్ కావడమనేది సత్యదూరమని, తప్పుదారి పట్టించడమే అవుతుందని అన్నారు. కాంగ్రెస్ నేత వాస్తవాలకు కట్టుబడి ఉండాలని, టైమ్‌లైన్‌ను తిరగ రాయకూడదని సూచించారు. 2020లో జైట్లీ తనను కలిశారని రాహుల్ చెబుతున్నారని, టైమ్‌లైన్‌ను ఒకసారి పరిశీలిస్తే అరుణ్ జైట్లీ 2019 ఆగస్టు 24న మరణించారని, వ్యవసాయ ముసాయిదా బిల్లులను 2020 జూన్ 3న కేంద్ర క్యాబినెట్ తీసుకొచ్చిందని, 2020 సెప్టెంబర్‌లో చట్టాలు రూపొందించడం జరిగిందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో అమిత్ మాలవీయ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి