Apple Moves to India: అమెరికాకు పంపే ఐఫోన్లు ఇక భారత్‌లోనే తయారీ
ABN , Publish Date - Apr 26 , 2025 | 04:05 AM
ఆపిల్ కంపెనీ ఐఫోన్ల తయారీ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించాలనే యోచనలో ఉంది. ట్రంప్ విధించిన సుంకాలు, చైనా మీద ఆధారత తగ్గించాలన్న వ్యూహం ఇందుకు కారణంగా కనిపిస్తోంది

చైనాలో ఉన్న తమ పరిశ్రమను భారత్‌కు తరలించాలని ఆపిల్ యోచన
ట్రంప్ విధించిన సుంకాలే కారణం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: అమెరికాలో విక్రయించే ఐఫోన్‌ల తయారీ యూనిట్‌ను చైనా నుంచి భారత్‌కు తరలించాలని ఆపిల్ కంపెనీ యోచిస్తున్నట్లు వెల్లడైంది. చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్న కంపెనీ దీర్ఘకాలిక వ్యూహంతోపాటు, ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల ప్రభావమూ దీనికి కారణమని సమాచారం. చైనా దిగుమతుల మీద ట్రంప్ 145 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. దీనికి తాత్కాలికంగా 90 రోజుల మినహాయింపు ఇచ్చినప్పటికీ.. చైనా మీద ట్రంప్ తొలినుంచీ గుర్రుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో, చైనాలో తయారయ్యే ఐఫోన్లను అమెరికాకు తీసుకెళ్తే సుంకం కారణంగా వాటి ధర భారీగా పెరుగుతుంది. దీంతో, ఈ తయారీకేంద్రాన్ని భారత్‌కు తరలించాలని ఆపిల్ భావిస్తోంది. భారత ఉత్పత్తుల మీద సుంకాన్ని ట్రంప్ 26 శాతానికే పరిమితం చేశారు. ప్రస్తుతం ఇది కూడా అమలులో లేదు. ఇప్పటికే భారత్‌లో ఫాక్స్‌కాన్, టాటా ఎలకా్ట్రనిక్స్ సంస్థల సహకారంతో ఆపిల్ యూనిట్లు నడుస్తున్నాయి. అమెరికా మార్కెట్లో ఆపిల్ ఏటా సగటున ఆరు కోట్ల ఐఫోన్లను విక్రయిస్తోంది. 2026 నాటికి ఈ ఆరు కోట్ల ఐఫోన్ల తయారీని మొత్తంగా భారత్‌లోనే చేపట్టాలని ఆపిల్ భావిస్తోంది.