Share News

Delhi Blast: ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి అప్పగింత

ABN , Publish Date - Nov 11 , 2025 | 04:51 PM

భారీ పేలుడు నేపథ్యంలో ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారంనాడు తన నివాసంలో రెండోసారి అత్యున్నత భద్రతా స్థాయి సమావేశం నిర్వహించారు.

Delhi Blast: ఢిల్లీ పేలుళ్ల కేసు ఎన్ఐఏకి అప్పగింత
Delhi blasts

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసున్న భారీ పేలుడు ఘటనపై దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కేంద్ర హోం శాఖ అప్పగించింది. దీంతో ఎన్ఐఏ వెంటనే రంగంలోకి దిగింది. ఘటనా స్థలికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపులు, సాక్ష్యాల సేకరణ, స్థానిక అధికారుల సమన్వయంతో అనుమానితుల కదలికలు, ఘటన వెనుక కుట్రను కనిపెట్టే చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయిన దరిమిలా ఇది ఉగ్రవాద చర్యగా కేంద్రం అనుమానిస్తుండటంతో ఎన్ఐఏకు దర్యాప్తు బాధ్యతను కేంద్రం అప్పగించింది.


అమిత్‌షా అత్యున్నత భద్రతా సమావేశం

భారీ పేలుడు నేపథ్యంలో ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) మంగళవారంనాడు తన నివాసంలో రెండోసారి అత్యున్నత భద్రతా స్థాయి సమావేశం నిర్వహించారు. సుమారు గంటన్నర సేపు జరిగిన ఈ సమావేశంలో హోం సెక్రటరీ గోవింద్ మోహన్, ఐడీ డైరెక్టర్ తపన్ దేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా, ఎన్ఐఏ డీజీ సదానంద్ వంసత్ దాటే, జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు.


ఆత్మాహుతి దాడి..

ఘటనలో ఉపయోగించిన ఐ20 కారుకు పుల్వామాతో సంబంధం ఉందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఇది ఆత్మహుతి దాడి కావచ్చని అనుమానిస్తున్నారు. సోమవారం రాత్రి పహర్‌గంజ్, దర్యాగంజ్ సమీప ప్రాంతాల్లోని హోటళ్లపై పోలీసులు దాడులు చేశారు. హోటల్ రిజిస్ట్రర్లు తనిఖీ చేశారు. ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగిస్తున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినళ్లలో నిఘాను కట్టుదిట్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

మరి కొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు

ఢిల్లీ పేలుళ్ల ఘటన.. కీలక వ్యక్తి ఫొటో వెలుగులోకి..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 11 , 2025 | 04:52 PM