Rajya Sabha By Election: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:22 AM
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అన్నామలై, మందకృష్ణ మాదిగ, స్మృతి ఇరానీ వంటి పేర్లు చర్చల్లో ఉన్నాయి

ఆయన్న మంత్రివర్గంలోకీ తీసుకుంటారని ప్రచారం
మందకృష్ణ, స్మృతి ఇరానీ పేర్లపైనా ఊహాగానాలు
అమిత్ షా, చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ
చెన్నై/న్యూఢిల్లీ, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని మంగళవారం ఢిల్లీలో తనను కలసిన సీఎం చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టు తెలిసింది. బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపేందుకు చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. కాగా, విజయసాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఎవరిని ప్రతిపాదిస్తుందన్న విషయంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అన్నామలైకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయన్ను మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటారని భోగట్టా. మరోవైపు మాదిగ దండోరా నేత మందకృష్ణ మాదిగకు అవకాశం కల్పించే అంశంపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. ఢిల్లీలోనే ఉన్న మందకృష్ణ మాదిగ... మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో వెళ్లి అమిత్ షాను, చంద్రబాబును కలుసుకున్నారు. అలాగే కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా బీజేపీ వర్గాల్లో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఏదేమైనా ఆ సీటనుు మళ్లీ విజయసాయి రెడ్డికే కేటాయిస్తారంటూ వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని అటు బీజేపీ, ఇటు టీడీపీ వర్గాలు ధ్రువీకరించాయి.