Malegaon Blasts: మాలేగావ్ పేలుళ్ల కేసు..ఏడుగురు నిందితులూ నిర్దోషులే
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:42 AM
పదిహేడేళ్లనాటి మాలేగావ్ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. బీజేపీ మాజీ

వారికి వ్యతిరేకంగా నమ్మదగ్గ సాక్ష్యాల్లేవు
పేలుళ్లకు వాడిన బైక్ ప్రజ్ఞాదేనని నిరూపించలేకపోయారు
ఈ కేసులో.. ‘ఉపా’ వర్తించదు
ముంబై ప్రత్యేక కోర్టు జడ్జి ఏకే లహోటీ
ఈ విజయం మా ఒక్కరిదే కాదు.. కాషాయ విజయం కూడా: ప్రజ్ఞా సింగ్
‘కాషాయ ఉగ్రవాదం’ అన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి: బీజేపీ
ముంబై రైలు పేలుళ్ల నిందితుల విడుదలపై స్టే కోరిన కేంద్రం ఈ కేసులో ఏం చేస్తుంది?: అసదుద్దీన్
ముంబై, హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): పదిహేడేళ్లనాటి మాలేగావ్ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి బలమైన, నమ్మదగ్గ సాక్ష్యాలేవీ లేవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. పేలుళ్లకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్‌దేనని, ఆ బైక్ ఆమె పేరిటే రిజిస్టర్ అయ్యిందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని... ఆ బైక్‌పైనే బాంబు పెట్టి పేల్చారన్న విషయాన్ని నిర్ధారించలేకపోయిందని.. కేవలం అనుమానంతో ఎవరినీ దోషులుగా ప్రకటించలేమని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదానికి మతం లేదని.. ఈ కేసును విచారించిన ప్రత్యేక జడ్జి ఏకే లహోటీ పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయన్న ఆయన.. నిందితులపై ఆరోపణలు పూర్తిగా నిరూపించలేకపోయినందున వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ కేసులో ఉపా (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) నిబంధనలు వర్తించవని తేల్చిచెప్పారు. ఈ పేలుళ్లలో చనిపోయిన ఆరుగురి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున.. గాయపడ్డ 101 మందికి రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించాల్సిందిగా ఆదేశించారు. ఈ తీర్పు వినగానే.. ఏడుగురు నిందితుల (ప్రజ్ఞా ఠాకూర్, ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేశ్ ఉపాధ్యాయ (రిటైర్డ్), అజయ్ రహీర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి) ముఖాలపై చిరునవ్వు మెరిసింది. ఈ తీర్పు పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి, తమ న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం తమ విజయం మాత్రమే కాదని.. కాషాయ విజయం అని ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యానించారు.
ఈ కేసు కారణంగా తన జీవితం 17 సంవత్సరాలుగా నాశనమైందని.. కాషాయ ధ్వజాన్ని అవమానించడానికి ప్రయత్నించినవారిని దేవుడు శిక్షిస్తాడని అన్నారు. బీజేపీ సైతం కోర్టు తీర్పును స్వాగతించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ ఎదుగుదలను అడ్డుకోవడానికి, ముస్లిం ఓటర్లను బుజ్జగించడానికి ‘హిందూ ఉగ్రవాదం’ అనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చిందని దుయ్యబట్టింది. కాషాయ ఉగ్రవాదం ఎప్పుడూ లేదని.. ఎప్పటికీ ఉండబోదని బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. కాషాయ ఉగ్రవాదం అంటూ విష ప్రచారం చేసి సనాతన ధర్మాన్ని అప్రతిష్ఠపాలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా, రాహుల్ తదితరులు ఇప్పుడు హిందువులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు. ‘కాషాయ ఉగ్రవాదం’ అనే మాటను విస్తృతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే వ్యాఖ్యానించారు.ఇక.. ఉగ్రవాదాన్ని ఏ మ తంతోనూ ముడిపెట్టకూడదని.. ఏ మతమూ హింస ను ప్రోత్సహించదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాగా.. కోర్టు తీర్పును రాష్ట్ర సర్కారు ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయాలని మహారాష్ట్రకు చెందిన ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ డిమాండ్ చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. ఈ కేసులో కోర్టు తీర్పు తమకు తీవ్ర నిరాశ కలిగించిందని వ్యాఖ్యానించారు. మతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి కేసు దర్యాప్తులో, ప్రాసిక్యూషన్‌లో ఉదాసీనత ప్రదర్శించడం వల్లే నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారని పేర్కొన్నారు. ముంబై ట్రైన్ బ్లాస్ కేసులో నిందితుల విడుదలపై తక్షణమే స్టే కోరిన మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాయని ఆయన నిలదీశారు.
ఇదీ కేసు నేపథ్యం..
2008 సెప్టెంబరు 29న.. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో రెండుచోట్ల జరిగిన పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. తొలుత మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. ప్రజ్ఞాఠాకూర్ సహా 16 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎంకోకా (మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్) కింద అభియోగాలు నమోదు చేసింది. 2011లో ఈ కేసు దర్యాప్తు ఎన్‌ఐఏ చేతికి వచ్చింది. ఈ కేసులో సాక్షులందరినీ విచారించిన ఎన్‌ఐఏ.. ప్రజ్ఞా ఠాకూర్ సహా మరికొందరికి 2016లో క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే, అదే ఎన్‌ఐఏ యూటర్న్ తీసుకుని ప్రజ్ఞాఠాకూర్ సహా ఈ కేసులో ఏడుగురు నిందితులకూ ఉరిశిక్ష విధించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో కోర్టుకు విజ్ఞప్తి చేసింది. కానీ, కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చి.. ఆ ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. దర్యాప్తు సంస్థలు మారడమే కాదు.. 17 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసుపై ఐదుగురు జడ్జిలు విచారణ జరపడం గమనార్హం.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News