Tamilnadu SIR: సర్‌కు అనుకూలంగా సుప్రీంకోర్టులో అన్నాడీఎంకే పిటిషన్
ABN , Publish Date - Nov 10 , 2025 | 08:46 PM
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో డూప్లికేట్ పేర్లు, తప్పుడు పేర్లు, అనర్హత కలిగిన ఓటర్లు రిజిస్టరైనట్టు పలు ఉదంతాలు ఉన్నాయని అన్నాడీఎంకే పేర్కొంది.
చెన్నై: తమిళనాడు ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు అనుకూలంగా అన్నాడీఎంకే (AIADMK) పార్టీ సుప్రీంకోర్టు (Supreme Court)లో సోమవారంనాడు పిటిషన్ వేసింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ముందు ఓటర్ల జాబితా సవరణ అనేది సరైన చర్య అని అన్నాడీఎంకే పేర్కొంది. ఎస్ఐఆర్ ప్రక్రియ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ డీఎంకే ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అన్నాడీఎంకే తాజా పిటిషన్ వేసింది. డీఎంకే పిటిషన్‌పై నవంబర్ 11న విచారణ జరుగనుంది.
తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో డూప్లికేట్ పేర్లు, తప్పుడు పేర్లు, అనర్హత కలిగిన ఓటర్లు రిజిస్టరైనట్టు పలు ఉదంతాలు ఉన్నాయని అన్నాడీఎంకే పేర్కొంది. వీటిని సరిచేయని పక్షంలో ఓటర్ల జాబితా ఇదే తప్పులతో కొనసాగుతుందని, ఎన్నికల నిష్పాక్షికతపై దీని ప్రభావం పడుతుందని అన్నాడీఎంకే తెలిపింది. ఎలాంటి తప్పులు లేని ఖచ్చితమైన ఎన్నికల జాబితాను తాము కోరుతున్నట్టు సుప్రీంకోర్టుకు అన్నాడీఎంకే తెలిపింది.
సీపీఎం సైతం..
మరోవైపు, తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహణకు ఈసీ ఇచ్చిన ఆదేశాల రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సీపీఎం కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈసీ చర్య పక్షపాతంతో కూడిన చట్టవ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యగా సీపీఎం ఆ పిటిషన్‌లో పేర్కొంది. డీఎంకే పిటిషన్‌తో పాటు సీపీఎం పిటిషన్‌పైనా సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రంతో కూడిన ధర్మాసనం మంగళవారంనాడు విచారణ జరుపనుంది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ సమీపంలో భారీగా ఆయుధాలు స్వాధీనం.. దర్యాప్తు ముమ్మరం..