Share News

Sayaji Shinde: తపోవనంలో వేలాది చెట్ల నరికివేత.. ప్రభుత్వ నిర్ణయంపై సయాజీ షిందే ఆగ్రహం

ABN , Publish Date - Nov 30 , 2025 | 04:18 PM

వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నాసిక్‌లో జరుగనున్న మహా కుంభమేళా కోసం తపోవన్‌లోని 1,200 ఎకరాల్లో సాధువులకు వసతి గృహాలను నిర్మించాలని మహాయుతి సర్కార్ నిర్ణయించింది.

Sayaji Shinde: తపోవనంలో వేలాది చెట్ల నరికివేత.. ప్రభుత్వ నిర్ణయంపై సయాజీ షిందే ఆగ్రహం
Sayaji Shinde

ముంబై: మహారాష్ట్రలోని నాసిక్ సిటీలో నిర్వహించనున్న మహాకుంభమేళా కోసం తపోవనం ప్రాంతంలో వేలాది చెట్లను నరికివేసేందుకు మహరాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిరసనలు వ్యక్తవుతున్నాయి. అధికార కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్‌సీపీ సభ్యుడు, నటుడు సయాజీ షిందే (Sayaji Shinde) శనివారంనాడు తపోవన్ ప్రాంతాన్ని సందర్శించారు. చెట్ట నరికివేత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.


వచ్చే ఏడాది అక్టోబర్ 31వ తేదీ నుంచి నాసిక్‌లో జరుగనున్న మహా కుంభమేళా కోసం తపోవన్‌లోని 1,200 ఎకరాల్లో సాధువులకు వసతి గృహాలను నిర్మించాలని మహాయుతి సర్కార్ నిర్ణయించింది. సాధువుల వసతి గృహాల నిర్మాణం కోసం1,670 చెట్లను నరికివేయాలని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానించడంపై వందలాది అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణవేత్తలు నిరసనబాట పట్టారు. ఈ చెట్లలో వందేళ్లకు పైబడిన చెట్లు ఎన్నో ఉన్నాయని, చెట్ల నరికివేతకు మార్కింగ్ చేశారని చెబుతున్నారు.


ఒక్క చెట్టును కూడా నరకనీయం: షిందే

చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ఇప్పటికే తాము గళం విప్పామని సయాజీ షిందే తెలిపారు. 'చెట్లు మన అమ్మానాన్నలు. సాధుగ్రామ్ కోసం ఒక్క చెట్టును కూడా మేము నరకనీయం. సాధువులు వస్తారు, వెళ్తారు..పెద్ద తేడా ఏమీ ఉండదు. కానీ చెట్లు మాయమైతే అది మన జీవితాలపై, భవిష్యత్ తరాలపై ప్రభావం పడుతుంది. చెట్లు ప్రపంచ సెలబ్రెటీలు. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఎలాంటి రహస్య ఎజెండా ఉండకూడదు' అని అన్నారు. సాధువులు, మహంతులు ఎంతో మంచివారని, కానీ వెయ్యి మంది వచ్చి పది మందికి ఒక్కో చోటు కల్పిస్తే వారిని సాధువులు, మహంతులు అనరని, అలాంటి వాళ్లు ఇక్కడకు వచ్చి నాసిక్‌ను నాశనం చేయరాదని కోరారు. చెట్ల నరికివేతను స్థానిక ప్రజలు కలికట్టుగా ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వం పట్టుదలకు పోతే ప్రతిఘటిస్తామని చెప్పారు.


పారిశ్రామికవేత్తలకు అప్పగించేందుకే: రాజ్‌ఠాక్రే

కుంభమేళాలో సాధు గ్రామ్ నిర్మాణం పేరుతో పెద్దఎత్తున చెట్లు నరకాలనే నిర్ణయాన్ని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే తప్పుపట్టారు. కుంభమేళా సాకుతో చెట్లు నరికి ఆ తర్వాత ఆ భూములను తమకు ఇష్టులైన పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. నాసిక్‌లో ఎంఎన్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మౌలిక వసతుల పనులు చేపట్టామని అన్నారు. ఎప్పుడూ చెట్లు నరకాలని తాము అనుకోలేదని చెప్పారు. ప్రత్యామ్నాయంగా వివిధ లొకేషన్లలో మొక్కలు నాటుతామని ప్రభుత్వం బూటకపు హామీలిస్తోందని, కానీ అవి ఎప్పటికీ నెరవేరవని అన్నారు. ఐదు రెట్లు అదనంగా చెట్లు నాటతామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు సాధుగ్రామ్ అక్కడే ఎందుకు నిర్మించరాదని ప్రశ్నించారు. చెట్ల నరికివేత నిర్ణయాన్ని నాసిక్ ప్రజలు తిప్పికొట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కూడా తాము ఈ చర్యను వ్యతిరేకిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ఘర్షణ వైఖరికి దిగితే జరిగే పోరాటంలో ప్రజలకు ఎంఎన్ఎస్ అండగా నిలుస్తుందన్నారు.


ఉద్ధవ్ ఠాక్రే ఏమన్నారంటే..

దీనికి ముందు, శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, వనవాస సమయంలో సీతారామలక్ష్మణులు ఈ తపోవనంలో నివసించారని చెప్పారు. చెట్లను నరకడం హిందుత్వ పేరుతో అవినీతికి పాల్పడటమేనని, బీజేపీది నకిలీ హిందుత్వమని, చెట్లను నరకడం కాంట్రాక్టర్ల లబ్ధి కోసమేనని తప్పుపట్టారు. ప్రభుత్వ చర్చపై రోడ్లపైకి వచ్చేందుకు వెనుకాడమని ఆ పార్టీ మరో నేత అరవింద్ సావంత్ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి..

ఎస్ఐఆర్ గడువు 7 రోజులు పొడిగింపు.. ఈసీ కీలక నిర్ణయం

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 05:48 PM