Share News

Siliguri Military Bases: సిలిగురి కారిడార్‌‌లో భద్రత మరింత పటిష్టం.. మూడు సైనిక స్థావరాల ఏర్పాటు

ABN , Publish Date - Nov 30 , 2025 | 01:28 PM

సిలిగురి కారిడార్‌లో భద్రతను కేంద్ర ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. చైనా, బంగ్లాదేశ్‌ నుంచి ఎలాంటి ముప్పునైనా తట్టుకునేలా మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది.

Siliguri Military Bases: సిలిగురి కారిడార్‌‌లో భద్రత మరింత పటిష్టం.. మూడు సైనిక స్థావరాల ఏర్పాటు
Siliguri Corridor New Military Bases

ఇంటర్నెట్ డెస్క్: దేశ రక్షణకు అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్‌లో కేంద్ర ప్రభుత్వం భద్రతను మరింత పటిష్ఠం చేసింది. భారత్ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే 22 కిలోమీటర్ల ప్రాంతాన్ని సిలిగురి కారిడార్ అంటారు. బంగ్లాదేశ్‌కు సమీపంలోని ఈ ప్రాంతంలో తాజాగా మూడు కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. అక్కడి దుభ్రీ, కిషన్‌గంజ్‌, చోప్రా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అత్యవసర సమయాల్లో వేగంగా సేనలను రంగంలోకి దింపేలా వివిధ సాయుధ దళాలు, మిలిటరీ, నిఘా బృందాలను సైనిక స్థావరాల్లో ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి ఎలాంటి ముప్పు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. సిలిగురి కారిడార్‌కు పూర్తి రక్షణ ఇచ్చేలా వ్యూహాత్మక ప్రాంతాల్లో మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చోప్రాలోని సైనిక స్థావరం బంగ్లాదేశ్ సరిహద్దుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంది (New Military Bases in Siliguri Corridor).


ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌తో దౌత్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ ఈ చర్య తీసుకుంది. చైనా, పాకిస్థాన్‌లకు బంగ్లాదేశ్ సన్నిహితమవుతున్న నేపథ్యంలో సిలిగురి కారిడార్‌ శత్రుదుర్భేద్యంగా మార్చేందుకు నడుం కట్టింది. చైనా నుంచి బంగ్లాదేశ్ అత్యాధునిక జే-10సీ ఫైటర్లను 2.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తుందన్న వార్తలు వినబడుతున్నాయి. చైనాతో కలిసి సంయుక్త డ్రోన్ ఉత్పత్తి ప్రాజెక్టు నెలకొల్పేందుకు కూడా బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు అత్యంత సమీపాన ఉన్న సిలిగురి కారిడార్ భారత్‌కు భద్రతాపరంగా అత్యంత కీలకంగా మారింది. దీంతో, కేంద్రం ప్రభుత్వం కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది.


ఇవి కూడా చదవండి..

యువతపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు

ఇండిగో ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 30 , 2025 | 02:56 PM