India Population: భారత్‌లో తగ్గిన జననాలు.. 2080 నాటికి స్థిరీకరణ.!
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:39 PM
దేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతోంది. రెండు దశాబ్దాల కాలంలో టీఎఫ్ఆర్ గణనీయంగా తగ్గడంతో 2080 నాటికి భారత జనాభా స్థిరంగా ఉంటుందని ఐఏఎస్పీ తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో జనాభా(India Population) 2080 నాటికి సుమారు 1.8 నుంచి 1.9 బిలియన్లకు స్థిరపడుతుందని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ పాపులేషన్(IASP) తెలిపింది. దేశంలో జననాల రేటు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని ఐఏఎస్పీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాలో 2000 ఏడాదిలో 3.5గా ఉన్న సంతానోత్పత్తి రేటు(TFR).. రెండు దశాబ్దాల కాలంలో గణనీయంగా తగ్గి 2.1కి పడిపోయిందని ఐఏఎస్పీ పేర్కొంది. దీంతో దేశంలో జననాలు తగ్గిపోవడం సహా జనాభా పెరుగుదల నెమ్మదించిందని ఐఏఎస్పీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రన్(IASP General Secretay Anil Chandran) వివరించారు.
'భారత దేశ జనాభా 2080 నాటికి 1.8 - 1.9 బిలియన్లకు చేరుకుని, అక్కడే స్థిరపడే అవకాశముంది. దేశ జనాభా 2 బిలియన్ల కంటే తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు కూడా అంచనా వేస్తున్నాయి. అభివృద్ధి, విద్య స్థాయులు పెరగడమే సంతానోత్పత్తి తగ్గుదలకు ప్రధాన కారణం. ముఖ్యంగా మహిళలు అక్షరాస్యులు అవడంతో చిన్న కుటుంబాలు ఏర్పడుతున్నాయి.' అని చంద్రన్ చెప్పారు.
పశ్చిమ్ బెంగాల్‌లో అత్యల్పం..
జనాభా పెరుగుదల పట్ల ప్రజల్లో అవగాహన రావడంతో.. జననాల్ని విస్తృతంగా నియంత్రించగల్గుతున్నారని అనిల్ చంద్రన్ తెలిపారు. అయితే.. నిరక్షరాస్యులైన కొందరు మహిళల కుటుంబాలు ఇప్పటికీ ముగ్గురు లేదా అంతకుమించి సంతానాన్ని పొందుతున్నాయన్నారు. కానీ విద్యావంతులైన కుటుంబాల్లో ఈ రేటు 1.5-1.8కి పరిమితమైందని స్పష్టం చేశారాయన.
ఉదాహరణకు.. కేరళ(Kerala) ఆ రాష్ట్రంలో 1987-89 మధ్య టీఎఫ్ఆర్ 2.1 ఉండగా.. ప్రస్తుతం 1.5కి తగ్గిందని పేర్కొన్నారు. అలాగే పశ్చిమ్ బెంగాల్(West Bengal)లోనూ 2013లో 1.7 నుంచి 2023 నాటికి 1.3కి పతమైనందని ఆ రాష్ట్ర శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(SRS) గణాంకాలను వివరించారు. దీంతో బెంగాల్ ఇప్పుడు దేశంలోనే అత్యల్ప టీఎఫ్ఆర్ కలిగి ఉందన్నారు. ఆ తర్వాత తమిళనాడు(Tamilnadu), ఢిల్లీ(Delhi)లోనూ అత్యల్ప టీఎఫ్ఆర్ ఉందని ఆయన తెలిపారు. అయితే.. దేశంలో జననాల రేటు తగ్గుతున్నప్పటికీ ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపడుతున్న కారణంగా ఆయుర్దాయం క్రమంగా పెరుగుతోందని చెప్పారాయన.
ఇవీ చదవండి: