Share News

AAP: అధికారికంగా గుడ్‌బై.. ఇండియా కూటమికి ఆప్ షాక్

ABN , Publish Date - Jul 18 , 2025 | 02:43 PM

ఇండియా కూటమి కింద 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని, అయితే ఆ తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలో సోలోగానే ఎన్నికల్లోకి దిగాయని సంజయ్ సింగ్ చెప్పారు.

AAP: అధికారికంగా గుడ్‌బై.. ఇండియా కూటమికి ఆప్ షాక్
INDIA bloc

న్యూఢిల్లీ: ఇండియా (INDIA) కూటమికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల వరకూ తమ కూటమి పరిమితమని స్పష్టం చేసింది. ఆప్ పార్లమెంటు సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఇండియా కూటమి కింద 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పనిచేశాయని, అయితే ఆ తర్వాత జరిగిన హర్యానా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు సోలోగానే ఎన్నికల్లోకి దిగాయని చెప్పారు.


'మేము చాలా స్పష్టంగా మా వైఖరి చెప్పాం. లోక్‌సభ ఎన్నికలకే ఇండియా కూటమి పొత్తులు పరిమితం. పార్లమెంటుకు సంబంధించి ప్రభుత్వం తప్పుడు విధానాలను మేము ఎప్పుడూ ఎండగడుతూనే ఉన్నాం. బీహార్, యూపీ, పూర్వాంచల్‌లో ఇళ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ప్రస్తుతం మేము ఇదే అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తనున్నాం' అని సంజయ్ సింగ్ చెప్పారు. ఢిల్లీలోని మురికివాడలను ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తోందని ఆరోపించారు. జూలై నుంచి ఆగస్టు 21వ తేదీ వరకూ జరిగే పార్లమెంటు సమావేశంలో తమ పార్టీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తుందని చెప్పారు.


దీనికి ముందు ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ సైతం స్లమ్ ఏరియాలను కూల్చేస్తున్నారంటూ బీజేపీ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. పేదలకు గూడు లేకుండా చేస్తున్నారని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆరోపించారు. 50 డిగ్రీల సెల్సియస్ ఎండల్లో పేదల మురికివాడలు కూల్చేస్తుంటే జనం నిస్సహాయంగా రోడ్లపై కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు కూడా దీనిపై తాను ఒక వీడియో విడుదల చేశానని, బీజేపీ కళ్లనీ పేదల భూములపైనే ఉన్నాయని, ఏడాదిలోగా వాటిని కూల్చేస్తారని, ఓటు వేసి పొరపాటు చేయవద్దని తాను కోరినట్టు చెప్పారు. అయితే ఐదు నెలల్లోనే బుల్డోజర్లతో ఢిల్లీని ధ్వంసం చేశారని తీవ్ర విమర్శలు చేశారు.


ఇవి కూడా చదవండి..

ఆర్మీ చేతికి ఏకే 203.. నిమిషానికి 700 రౌండ్లు..

పృథ్వీ 2, అగ్ని 1 బాలిస్టిక్ క్షిపణుల పరీక్ష విజయవంతం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 18 , 2025 | 03:33 PM