Salary Hike: 8వ వేతన సంఘం.. వేతనాల్లో 34% పెంపు
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:18 AM
దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం..

మార్కెట్లో పెరగనున్న వినియోగం
ఆర్థిక వ్యవస్థకు చేకూరనున్న లబ్ధి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు,
పింఛన్లపై ‘అంబిట్ క్యాపిటల్’ నివేదిక
ఫిట్‌మెంట్ 2.86 ఉండే అవకాశం
న్యూఢిల్లీ, జూలై 10: దేశవ్యాప్తంగా లక్షలాదిమంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం.. వేతనాలను, పింఛన్లను 30 నుంచి 34 శాతం మేర పెంచటానికి సిఫార్సు చేయవచ్చని తెలుస్తోంది. అంబిట్ క్యాపిటల్ అనే బ్రోకరేజీ సంస్థ ఈ మేరకు ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. కొత్త వేతన సంఘం సిఫార్సులతో దాదాపు ఒక కోటీ పది లక్షల మందికి లబ్ధి చేకూరవచ్చని తెలిపింది. వేతనాలు, పింఛన్ల పెంపు వల్ల మార్కెట్లో వినియోగం పెరుగుతుందని, తద్వారా ఆర్థికవ్యవస్థకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది.
7వ వేతన సంఘం.. 14% పెంపుదల
2016 జనవరి-2025 డిసెంబరు కాలవ్యవధి కోసం ఏర్పాటైన 7వ వేతన సంఘం సిఫార్సులే ప్రస్తుతం అమలులో ఉన్నాయి. ఈ సంఘం 14 శాతం వేతన పెంపును మాత్రమే సిఫార్సు చేసింది. 1970 నుంచీ ఇదే అత్యంత తక్కువ పెరుగుదలగా నమోదైంది. ఈ ఏడాది జనవరిలో కేంద్రప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ.. చైర్మన్, సభ్యులుగా ఇప్పటికీ ఎవర్నీ నియమించలేదు. వేతన సంఘం విధివిధానాలనూ ప్రకటించలేదు. వాస్తవానికి, వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి రావాలి. కానీ, వేతన సంఘం ఇంకా రూపుదాల్చకపోవటం వల్ల 2027 నుంచిగానీ కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశాలు లేవని సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా, 8వ పే కమిషన్‌పై ఉద్యోగులు, పింఛనుదార్లు భారీ గా ఆశలు పెంచుకున్న నేపథ్యంలో అంబిట్ క్యాపిటల్ నివేదిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నివేదిక ప్రకారం.. 8వ వేతన సంఘం 2.86 వరకూ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రకటించవచ్చని, దీనివల్లే వేతనాలు, పింఛన్లు 30 నుంచి 34 శాతం వరకూ పెరిగే అవకాశం ఉంది.
పదేళ్లకోసారి పే కమిషన్
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను పెంచటానికి పదేళ్లకోసారి వేతన సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేస్తుంది. పే కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కమిషన్ అమల్లోకి రావటానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుంది. 7వ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్రం 2014 ఫిబ్రవరిలో ప్రకటన చేసింది. కమిషన్ విధివిధానాలు, కూర్పు, క్యాబినెట్ ఆమోదం, నివేదిక తయారీ మొదలైనవాటికి రెండేళ్లు పట్టింది. 2016 జనవరి నుంచి 7వ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చాయి.