Rajasthan School Collapse: కుప్పకూలిన స్కూల్ భవనం
ABN , Publish Date - Jul 26 , 2025 | 02:47 AM
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఝలావర్ జిల్లా పిప్లోడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల భవనంలోని ఓ భాగం కూలిపోయింది.

రాజస్థాన్‌లో దుర్ఘటన.. ఏడుగురు విద్యార్థుల మృతి
మరో 28 మందికి గాయాలు.. కొందరి పరిస్థితి విషమం
ఉదయం వేళ ప్రార్థనకు సిద్ధమవుతుండగా ఘటన
వర్షాలతో నిలిచిన వరద.. గోడలు దెబ్బతినడంతోనే ప్రమాదం
పాఠశాల హెడ్‌మాస్టర్ సహా ఐదుగురు టీచర్ల సస్పెన్షన్
సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
ఝలావర్, జూలై 25: రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ఝలావర్ జిల్లా పిప్లోడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల భవనంలోని ఓ భాగం కూలిపోయింది. ఈ ఘటనలో స్లాబు, ఇటుక గోడల శిథిలాల కింద చిక్కుకొని ఏడుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 28 మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 7:45 గంటలకు విద్యార్థులు ప్రార్థన కోసం సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఝాలావర్‌లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో 9మందికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ బడిలో ఐదు తరగతి గదులు, ఒక కార్యాలయ గది ఉన్నాయి. స్కూలు భవనాన్ని 1994లో నిర్మించారు. 2011లో అదనంగా కొన్ని గదులను నిర్మించారు. ప్రస్తుతం కూలిపోయింది 31 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలోని పోర్షనే! అందులో 6, 7 తరగతుల విద్యార్థులు కూర్చుంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పాత భవనం చుట్టూ వరద చేరిందని.. ఆ నీటి చెమ్మకు గోడలు ఉబ్బిపోయి.. పూర్తిగా దెబ్బతినడం వల్లే భవనం కూలిపోయిందని జిల్లా విద్యాశాఖ అధికారి చెప్పారు. ప్రమాదంలో మొత్తంగా 35 మంది విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారమిచ్చిన 45 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఆ లోపు ఉపాధ్యాయులు, స్థానికులు, పిల్లల తల్లిదండ్రులు వచ్చి శిథిలాలలను తొలగించే ప్రయత్నం చేశారు. స్థానికుల్లో ఒకరు తన ఎక్స్‌కావేటర్‌ను తెచ్చి శిథిలాలను తొలగించారు.
గాయపడిన విద్యార్థులను ద్విచక్రవాహనాల మీదే ఆస్పత్రికి తరలించారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని.. స్కూలు భవనం శిథిలావస్థకు చేరుకుందని కొన్నాళ్ల క్రితమే అధికారులను కలిసి ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాద ఘటనకు బాఽధ్యులను చేస్తూ ప్రధానోపాధ్యాయురాలు మీనా గార్డ్ సహా ఐదుగురు ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనను రాజస్థాన్ మానవ హక్కుల సంఘం సూమోటోగా స్వీకరించింది. ప్రమాదంపై సమగ్ర నివేదిక అందజేయాలని, ప్రమాదానికి బాధ్యులపై తీసుకునే చర్యలు, మృతుల కుటుంబాలకు అందజేయనున్న పరిహారం వివరాలు తెలపాలని ఝలావర్ జిల్లా విద్యాధికారికి, బికనెర్‌లోని డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు, ఝాలావర్ ఎస్పీకి నోటీసులు జారీచేసింది. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన పిల్లలు వేగంగా కోలుకోవాలని ముర్ము ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. ఈ ఘటన తీవ్ర బాధాకరం అని.. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు అధికారులు సాధ్యమైనన్ని చర్యలు తీసుకుంటున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News