Contraceptive Products: రూ.97 కోట్ల విలువైన గర్భనిరోధక ఉత్పత్తులు నాశనం చేసేందుకు ప్లాన్
ABN , Publish Date - Jul 29 , 2025 | 07:34 AM
అమెరికా ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయానికి రెడీ అవుతోంది. రూ.97 కోట్ల విలువైన మహిళల గర్భనిరోధక ఉత్పత్తులను నాశనం చేయాలన్న నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అమెరికా ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయానికి సిద్ధమైంది. ఈ క్రమంలో మహిళలకు సంబంధించిన 97 కోట్ల రూపాయల విలువైన మహిళల గర్భనిరోధక ఉత్పత్తులను నాశనం చేయాలని ప్లాన్ చేశారు. ఇది తెలిసిన వైద్యులు సహా పలు సంస్థలు తీవ్రంగా ఖండించాయి. ఈ చర్యను మహిళల హక్కులపై దాడి, వనరుల వృథా అని విమర్శిస్తున్నారు. ఈ గర్భనిరోధక ఉత్పత్తులు బెల్జియంలోని ఒక వేర్‌హౌస్‌లో నిల్వ ఉన్నాయి. ఫ్రాన్స్‌లో వీటిని కాల్చివేయాలని భావిస్తున్నారు.
అమెరికా ప్రభుత్వం ఏం ప్రకటించింది?
జూలై 18న, బ్రిటిష్ వార్తాపత్రిక ది గార్డియన్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 97 కోట్ల రూపాయల విలువైన గర్భనిరోధక ఉత్పత్తులను నాశనం చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉత్పత్తుల్లో దీర్ఘకాలం పనిచేసే ఐయూడీలు, బర్త్ కంట్రోల్ ఇంప్లాంట్‌లు వంటివి ఉన్నాయని వెల్లడించింది. ఇవి ప్రపంచంలోని పేద దేశాలకు, ప్రధానంగా ఆఫ్రికా సరఫరా కోసం ఉద్దేశించబడినవి. బెల్జియంలోని గీల్ నగరంలోని ఒక వేర్‌హౌస్‌లో ఇవి నిల్వ ఉన్నాయి. జూలై చివరిలో వీటిని ఫ్రాన్స్‌లో కాల్చివేయనున్నట్లు గార్డియన్ పేర్కొంది.
నాశనం చేయాలని..
బైడెన్ కాలంలో యూఎస్‌ఏఐడీ కాంట్రాక్టుల నుంచి వచ్చిన గర్భనిరోధక ఉత్పత్తులను ప్రస్తుతం నాశనం చేయాలని తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి తెలిపారు. ట్రంప్ జనవరిలో అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్‌ఏఐడీ, అమెరికా విదేశీ సహాయ విభాగాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో గర్భస్రావాలను ప్రోత్సహించే లేదా నిర్వహించే ఎన్జీవోలకు సహాయం అందించకూడదని నిర్ణయించారు.
విదేశీ సహాయంలో కోతలు
ఈ విధానాన్ని విమర్శకులు గ్లోబల్ గ్యాగ్ రూల్ అని పిలుస్తున్నారు. 1984లో రోనాల్డ్ రీగన్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ప్రతి రిపబ్లికన్ అధ్యక్షుడు దీనిని పునరుద్ధరించారు. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం 800 కోట్ల రూపాయల విదేశీ సహాయంలో కోతలు విధించింది. దీనిలో ఎక్కువ భాగం యూఎస్‌ఏఐడీ కోసం ఉద్దేశించినవి. ఈ కోతల వల్ల 2030 నాటికి 1.4 కోట్ల మంది మరణించవచ్చని పరిశోధనలు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
బిస్కెట్లను కూడా ఇప్పటికే..
ఈ నెలలో అమెరికా, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్‌లోని పోషకాహారం లేని బాధిత బాలల కోసం ఉద్దేశించిన 500 మెట్రిక్ టన్నుల అధిక పోషక బిస్కెట్లను కూడా కాల్చివేసింది. అమెరికాలో గర్భస్రావ హక్కును 2022లో సుప్రీంకోర్టు రద్దు చేయడంలో ట్రంప్ తన పాత్రను గర్వంగా చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా అదే విధానంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ గర్భనిరోధక ఉత్పత్తులు 2027 నుంచి 2031 వరకు గడువు ముగిసే వరకు ఉపయోగపడతాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ప్రత్యామ్నాయాలు ఏంటి?
ఈ విషయంపై బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాలయంతో చర్చలు ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ఉత్పత్తుల నాశనాన్ని నిరోధించేందుకు తాత్కాలిక రీలొకేషన్ పరిష్కారాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. ఎంఎస్‌ఐ రీప్రొడక్టివ్ చాయిసెస్ సంస్థ ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ప్యాకేజింగ్, లాజిస్టిక్స్‌ను తమ ఖర్చుతో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. కానీ ఈ ఆఫర్‌ను అమెరికా తిరస్కరించింది. ఇంటర్నేషనల్ ప్లాన్డ్ పేరెంట్‌హుడ్ ఫెడరేషన్ కూడా ఇలాంటి ఆఫర్‌ను ఉచితంగా ఇచ్చింది. కానీ అది కూడా తిరస్కరించబడింది.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి