Trump Putin: ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఈ వారమే ట్రంప్ పుతిన్ చర్చ..
ABN , Publish Date - Mar 17 , 2025 | 10:20 AM
ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య యుద్ధం ముగించాలని అమెరికా కోరుకుంటోంది. ఈ క్రమంలో రష్యాతో సమావేశం అయిన అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ కీలక విషయాలను ప్రకటించారు.

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తి చూపుతున్నారని అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ అన్నారు. ఈ అంశంపై ఇరు దేశాల నాయకులు ఈ వారంలోనే ఫోన్ ద్వారా చర్చించుకోనున్నట్లు తెలిపారు. స్టీవ్ విట్‌కాఫ్ తాజాగా రష్యా అధ్యక్షుడితో నాలుగు గంటల పాటు సమావేశం అయ్యారు.
అనంతరం ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. పుతిన్..ట్రంప్ విధానాన్ని పూర్తిగా అంగీకరించారనే భావన కల్పించడానికి ఆయన సూచనలు ఇచ్చారని ప్రస్తావించారు. ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నారు. అలాగే, పుతిన్ కూడా ఇదే కోరుకుంటున్నారని భావిస్తున్నట్లు స్టీవ్ విట్‌కాఫ్ చెప్పారు.
కాల్పుల విరమణ ఒప్పందం
గత వారం అమెరికా-ఉక్రెయిన్ 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి సంతకం చేశాయి. కానీ రష్యా ఈ ఒప్పందాన్ని ఇప్పటివరకు అంగీకరించలేదు. అయితే, దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, త్వరలోనే సానుకూల ఫలితాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. విట్కాఫ్ ఈ అంశంపై మాట్లాడుతూ ఇది చాలా సంక్లిష్టమైన పరిస్థితే అయినా, రెండు దేశాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్, పుతిన్ మధ్య మంచి, సానుకూల చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను. మరికొన్ని రోజుల్లో ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉక్రెయిన్ ఆక్రమిత భూ భాగాలపై జెలెన్స్కీ వైఖరి
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన దేశానికి చెందిన భూభాగాలను రష్యా ఆక్రమించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టంగా తెలిపారు. ఆయన గతంలో అనేక సందర్భాల్లో ఇదే విధంగా ప్రకటించారు. రష్యా ఆక్రమించిన భూభాగాలపై తమ దృక్కోణాన్ని అమెరికా ప్రభుత్వం మారుస్తుందా అనే ప్రశ్నకు, విట్కాఫ్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. కానీ చర్చించడానికి ఇంకా సమయం ఉందన్నారు.
అమెరికా - రష్యా మధ్య కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు
యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఇటీవల రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, దౌత్య పరమైన తదుపరి చర్యల గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య కమ్యూనికేషన్ పునరుద్ధరణకు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
బ్రిటన్, రష్యాపై ఒత్తిడి పెంచుతోందా?
ఉక్రెయిన్‌పై వర్చువల్ సమావేశంలో బ్రిటిష్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, రష్యా కాల్పుల విరమణ ఒప్పందంపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రష్యా నుంచి వచ్చే సమాధానాలు సరిపోవని, ఉక్రెయిన్‌పై దాడులు పూర్తిగా ఆపాలని స్టార్మర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News