Share News

అమెరికాలో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:40 AM

అమెరికా వాతావరణ విభాగాల్లోని వందలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఫెడరల్‌ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఖర్చులను ఆదా చేయాలన్న డోజ్‌ విభాగం సూచనల మేరకు ఈ చర్యకు పూనుకొన్నారు.

అమెరికాలో కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు

  • పలు విభాగాల్లో వందలాది మందికి ఉద్వాసన

  • ఉద్యోగుల తొలగింపుపై అధ్యక్షుడు

  • డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు చట్ట విరుద్ధం

  • శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా జడ్జి విలియం అల్సప్‌ ఆదేశాలు చట్ట విరుద్ధమన్న ఫెడరల్‌ జడ్జి

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 28: అమెరికా వాతావరణ విభాగాల్లోని వందలాది మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. ఫెడరల్‌ విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించి ఖర్చులను ఆదా చేయాలన్న డోజ్‌ విభాగం సూచనల మేరకు ఈ చర్యకు పూనుకొన్నారు. దీంతో పాటు, నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్పియరిక్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎన్‌వోఏఏ) విభాగంలోనూ వందలాది మందిని తొలగించారు. అయితే, వాతావరణ అంచనాల విభాగంలో(ఎన్‌డబ్ల్యూఎ్‌స) తొలగించిన ఉద్యోగులంతా(375 మంది) ప్రొబేషనరీ ఉద్యోగులు. ఇక, ఎన్‌వోఏఏలో దాదాపు ఐదు వందల మందిని తొలగించారు. ఈ విభాగంలో మళ్లీ తొలగింపులు ఉంటాయని, తర్వాతి రౌండ్‌లో 800మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా, అమెరికాలోని సామాజిక భద్రతా(సోషల్‌ సెక్యూరిటీ) విభాగంలో పనిచేస్తున్న 7వేల మందిని సెలవులపై పంపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విభాగంలో 60వేల మంది పనిచేస్తున్నారు. ఇందులో దాదాపు 50ు సిబ్బందిని తొలగించే అవకాశం ఉందని అందులో పనిచేసే ఓ అధికారి చెప్పారు. డోజ్‌ సూచనలతో ఇప్పటికే పలు ఫెడరల్‌ విభాగాల్లో వేలాది మంది ఉద్యోగులను తొలగించారు.


ట్రంప్‌ ఆదేశాల నిలిపివేత

పలు విభాగాల్లో ఫెడరల్‌ ఉద్యోగులను తొలగిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ జడ్జి(ఫెడరల్‌) అల్సప్‌ అడ్డుకున్నారు. ట్రంప్‌ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్ని ఫెడరల్‌ విభాగాల్లోని ఉద్యోగులను తొలగించే అధికారం పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ కార్యాలయానికి లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర విభాగాల్లోని ప్రొబేషనరీ ఉద్యోగులను సైతం అది తొలగించలేదన్నారు.

Updated Date - Mar 01 , 2025 | 05:40 AM