Trump Stop Hiring Indians: భారతీయుల్ని నియమించుకోవద్దు
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:51 AM
టెక్ ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని, భారతీయులను నియమించుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలి
కంపెనీలు అంతర్జాతీయ ధోరణిని వదలాలి
నా పాలనలో ఈ సంస్కృతికి ముగింపు
సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం.. ఏఐ సదస్సులో డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, జూలై 24: టెక్ ఉద్యోగాల్లో అమెరికన్లకే ప్రాధాన్యం ఇవ్వాలని, భారతీయులను నియమించుకోవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. వాషింగ్టన్‌లో జరిగిన ఏఐ సదస్సులో ఆయన మాట్లాడుతూ గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు సున్నితంగా సూచనలు చేశారు. తాను ముందు నుంచి జపిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ నినాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్‌సెట్‌ను ఆయన విమర్శించారు. ‘‘ఇప్పుడు విదేశీయులను నియమించుకోవడాన్ని ఆపేయాలి. అమెరికన్లకు ఉద్యోగాలివ్వాలి. అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్నారు. దేశంలో లభించే స్వేచ్ఛను వాడుకుంటున్న చాలా టెక్ కంపెనీలు.. ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. నా పాలనలో ఈ సంస్కృతికి ముగింపునిస్తాను’’ అని వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన బడా టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలను స్థాపిస్తూ.. భారతీయులను ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయని, ఐర్లాండ్‌ను అడ్డుపెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయని విమర్శించారు. ‘‘ఈ విషయం మీకు(టెక్ కంపెనీల యాజమాన్యాలు) తెలుసు. ఇక్కడి(అమెరికా) ప్రజల అవకాశాలను పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యం చేస్తున్నారు. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజయం సాధించాలంటే.. సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడి టెక్ కంపెనీలు దేశానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మీరూ అదే చేయాలి’’ అని పిలుపునిచ్చారు. ఇదే సదస్సులో ఏఐకి సంబంధించి మూడు కీలక ఆదేశాలపై ట్రంప్ సంతకాలు చేశారు. అవి.. ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం.. అభివృద్ధిని వేగవంతం చేయడం.. ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారుచేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడడం. అంటే.. విన్నింగ్ రేస్ పేరుతో డాటా సెంటర్లను ఏర్పాటు చేసి, వేగంగా పెట్టుబడులను సాధించాలని.. ఫెడరల్ నిధులతో పనిచేసే ప్రాజెక్టులు(ఏఐ టూల్స్) రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఈ సదస్సు స్పష్టంచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
చెన్నైలో 4 చోట్ల ఏసీ బస్‌స్టాప్‌లు
ఈ రోజు ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
For More National News And Telugu News