Share News

Trump AI Video: బరాక్‌ ఒబామా అరెస్టు!

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:07 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా లక్ష్యంగా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ వివాదాస్పద చర్యకు పాల్పడ్డారు.

Trump AI Video: బరాక్‌ ఒబామా అరెస్టు!
Trump AI Video

  • ఏఐ వీడియో పోస్ట్‌ చేసిన ట్రంప్‌

  • ఒబామాను అరెస్టు చేస్తుంటే తాను..

  • చిరునవ్వులు చిందిస్తున్నట్లు వీడియో

  • అమెరికా అధ్యక్షుడి తీరుపై విమర్శలు

న్యూఢిల్లీ, జూలై 21: అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా లక్ష్యంగా.. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ వివాదాస్పద చర్యకు పాల్పడ్డారు. ఒబామాను పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) ద్వారా సృష్టించిన వీడియోను ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌’ సోషల్‌’లో పోస్ట్‌ చేశారు. ట్రంప్‌, ఒబామా ఇద్దరూ వైట్‌హౌస్‌లో కూర్చుని ముచ్చటించుకుంటుండగా.. ఎఫ్‌బీఐ పోలీసులు అక్కడికి వచ్చి ఒబామా రెక్కలు విరిచి బేడీలు వేసినట్లు, ట్రంప్‌ కాళ్ల వద్ద ఒబామా పడిపోయినట్లు ఈ వీడియోను సృష్టించారు. ఒబామాను అరెస్టు చేస్తుంటే ట్రంప్‌ చిరునవ్వులు చిందిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. పైగా, ‘చట్టానికి ఎవరూ అతీతులు కాదు’ అన్న వ్యాఖ్య కూడా వీడియోలో కనిపిస్తుంది. అనంతరం ఒబామా ఖైదీ దుస్తుల్లో జైల్లో కటకటాల వెనక ఉన్నట్లుగా చిత్రీకరించారు. 2016 ఎన్నికల సమయంలో ట్రంప్‌ అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు, ఎన్నికయ్యాక ఆయన పాలనను నియంత్రించేందుకు ఒబామా ప్రయత్నించారంటూ అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ట్రంప్‌ ఎన్నికలో రష్యా ప్రమేయం ఉందన్నట్లుగా ప్రచారం చేసినట్లు ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఈ వీడియోను పోస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. ట్రంప్‌ చర్యను నెటిజన్లు తప్పుబట్టారు. అయితే లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌ సంబంధాలు కొనసాగించినట్లుగా వార్తలు వస్తున్న వేళ.. దాని నుంచి దృష్టి మరల్చేందుకే ట్రంప్‌ ఈ చర్యకు దిగారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:07 AM