Trump: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్.. ఇజ్రాయెల్ దాడులు అద్భుతమని ప్రశంస
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:29 PM
అణు ఒప్పందంపై తమతో చర్చించేందుకు ఇరాన్‌కు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా టెహ్రాన్ అంగీకరించలేదని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావిస్తూ అద్భుతమైన దాడులు జరిగాయని, మరిన్ని బలమైన దాడులు పొంచి ఉన్నాయని ఇరాన్‌ను హెచ్చరించారు.

న్యూయార్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్ పెద్దఎత్తున దాడులకు దిగడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donal Trump) స్వాగతించారు. అద్భుతమైన దాడులు చేస్తోందంటూ ప్రశంసించారు. ఇదే సమయంలో ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు చేశారు ట్రంప్. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని, అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవాలని ఆ దేశానికి సూచించారు. పరిస్థితి చేయిదాటి పోకుండా తక్షణమే తమతో చర్చలు జరపాలని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.
అణు ఒప్పందంపై తమతో చర్చించేందుకు ఇరాన్‌కు చాలా అవకాశాలు ఇచ్చామని, అయినా టెహ్రాన్ అంగీకరించలేదని ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావిస్తూ అద్భుతమైన దాడులు జరిగాయని, మరిన్ని బలమైన దాడులు పొంచి ఉన్నాయని ఇరాన్‌ను హెచ్చరించారు. దాడుల్లో అమెరికా ప్రమేయం ఉందా? అని అడిగినప్పుడు, దానిపై తాను వ్యాఖ్యానించేది లేదని సమాధానమిచ్చారు.
మారణాయుధాలు ఎలా ఉపయోగించాలో ఇజ్రాయెల్‌కు బాగా తెలుసునని, పరిస్థితులు చేయి దాటకుండానే అమెరికాతో ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఆ పని చేస్తే ఇకముందు మరణాలు, విధ్వంసాలు ఉండవని చెప్పారు. ఇరాన్ అణు లక్ష్యాలను టార్గెట్‌గా చేసుకుని 'ఆపరేషన్ రైజింగ్ లయన్' పేరుతో ఇజ్రాయెల్ గురు, శుక్రవారాల్లో భీకర దాడులకు దిగింది. తమపై ఇరాన్ 100 డోన్లు ప్రయోగించిందని, వాటిని కూల్చివేయడంతోపాటు ఇరాన్ మిలటరీ, న్యూక్లియర్ స్థావరాలపై విరుచుకుపడినట్టు ప్రకటించింది. కాగా, ఇజ్రాయెల్ చర్యలను ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేని తీవ్రంగా ఖండించారు. జనావాసాలను కూడా విడిచిపెట్టకుండా తమ దేశంపై పంజా విసిరిసిన ఇజ్రాయెల్‌కు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో మహిళలు, చిన్నారులతో సహా పలువురు పౌరులు మృతిచెందారని, కనీసం 95 మంది గాయపడ్డారని టెహ్రాన్ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. అమెరికా షాకింగ్ నిర్ణయం..
ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై దాడులు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి