Share News

Trump: ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 02:10 PM

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఇరుదేశాల మధ్య యుద్దం ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు దేశాలకు అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ కీలక సూచన చేశారు.

Trump: ఒప్పందాన్ని ఉల్లంఘించ వద్దు: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
US President Donald Trump

వాషింగ్టన్, జూన్ 24: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని, తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించవద్దని ఇరు దేశాలను ఆయన హెచ్చరించారు. తాజాగా ఇజ్రాయెల్‌లోని పలు భూభాగాలపై ఇరాన్ దాడులు చేసింది. అయితే, సీజ్ ఫైర్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాడులకు పాల్పడింది. దీంతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారడంతో ట్రంప్ ట్రూత్ వేదికగా స్పందించారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న ఈ యుద్ధం నేటితో ముగిసిందన్నారు. ఇరాన్ అన్ని కార్యకలాపాలను తొలుత నిలిపివేసిందని.. ఇజ్రాయెల్ సైతం ఆ బాటను అనుసరిస్తుందని చెప్పారాయన.


ఇజ్రాయెల్ ఆక్రమిత భూభాగాలపై వరుస క్షిపణి దాడులు జరిగిన తరువాత ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇరాన్ ప్రభుత్వ మీడియా కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో కనీసం ఏడుగురు మరణించినట్లు తెలిపింది. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావడానికి కొన్ని క్షణాల ముందు చివరి రౌండ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఎస్ఎన్ఎన్ వార్తా సంస్థ తెలిపింది.

ఇదిలాఉంటే.. సీజ్ ఫైర్ ప్రకటించడంతో.. ఇజ్రాయెల్ సైన్యం తమ ప్రజలు సేఫ్ షెల్టర్ల నుంచి బయటకు రావొచ్చని సూచించింది. పరిస్థితిని అంచనా వేసిన తరువాత.. దేశవ్యాప్తంగా ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలనే నిబంధనను ఎత్తివేసినట్లు హోమ్ ఫ్రంట్ కమాండ్ ప్రకటించిందని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.


ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన..

ఖతార్‌లోని అమెరికన్ సైనిక స్థావరంపై ఇరాన్ దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత ట్రంప్.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణను ప్రకటించారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ జరిపిన దాడులపైనా ట్రంప్ స్పందించారు. ‘బలహీనమైన ప్రతీకార చర్య’గా అభివర్ణించారాయన. కాగా, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ మాట్లాడారని.. యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించారని వైట్ హౌస్ సీనియర్ అధికారు ఒకరు తెలిపారు. అంతేకాదు.. ఇరాన్ దాడులు చేయనంత వరకు ఇజ్రాయెల్ సీజ్ ఫైర్‌కు కట్టుబడి ఉంటుందన్నారు. ఇకపోతే.. తాము కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇరాన్ సైతం ధృవీకరించింది. అయితే, ఇజ్రాయెల్ తన దాడులను ఆపకపోతే తాము కూడా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి.

జూన్ 13న ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడిని ప్రారంభించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాలు వరుసగా పరస్పర దాడులకు పాల్పడ్డాయి. ఇదే సమయంలో అమెరికా జోక్యం చేసుకుని.. ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ ఎప్పుడూ అణ్వాయుధ కార్యక్రమాలు చేపట్టలేదని స్పష్టం చేసింది. ఒకవేళ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అలా చేయాలని భావిస్తే ప్రపంచ నాయకులెవరూ ఆపలేరని ఇరాన్ స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

దారుణం.. 30 మంది భార్యలు హతం

సింగయ్య మృతి.. రంగంలోకి వైసీపీ నేత

For More International News and Telugu News

Updated Date - Jun 24 , 2025 | 04:30 PM