Donald Trump: మాస్కోని కొట్టగలవా.. జెలెన్‌స్కీకి ట్రంప్ సూటిప్రశ్న
ABN , Publish Date - Jul 15 , 2025 | 08:16 PM
మాస్కోపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న ట్రంప్.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అంజేస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల పంపిణీని నాటో సమన్వయం చేస్తుందన్నారు. రష్యా చర్చలకు రాకపోవడంపై ట్రంప్ అంసతృప్తి వ్యక్తం చేయడం కొత్త కూడా కాదు.

వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించే విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్‌కు 50 రోజులు గడువు ఇచ్చారు. గడువులోగా యుద్ధానికి తెరదించకుంటే మాస్కోపై 100 శాతం ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు. ఓవల్ కార్యాలయంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సమావేశమైన ట్రంప్ ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. అయితే మరోవైపు ప్రైవేటుగా ఉక్రెయిన్‌తో జరిపిన సంభాషణల్లో రష్యాన్ భూభాగంపై మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేయాలని ట్రంప్ ప్రోత్సహించినట్టు కూడా తెలుస్తోంది.
మాస్కోపై తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్న ట్రంప్.. ఉక్రెయిన్‌కు ఆయుధాలు అంజేస్తామని వెల్లడించారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల పంపిణీని నాటో సమన్వయం చేస్తుందన్నారు. రష్యా చర్చలకు రాకపోవడంపై ట్రంప్ అంసతృప్తి వ్యక్తం చేయడం కొత్త కూడా కాదు. ఇక అమెరికా పెద్దన్న పాత్ర నుంచి తప్పుకుంటుందని గతంలోనూ ప్రకటించారు.
తాజాగా మరోసారి పుతిన్ తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడని, జూలై 4న జెలెన్‌స్కీతో ఫోన్ సంభాషణ జరిపారని ఒక ప్రముఖ పత్రిక తెలిపింది. రష్యా భూభాగం లోపలకు చొచ్చుకెళ్లి లక్ష్యాలపై దాడులు జరిపేందుకు ఉక్రెయిన్‌కు సుదీర్ఘ శ్రేణి ఆయుధాలను అందజేస్తామనే ప్రతిపాదన ఈ సందర్భంగా ట్రంప్ చేశారు. 'మాస్కోను నువ్వు కొట్టగలవా? సెయింట్ పీటర్‌బర్గ్‌ను కూడా కొట్టగలవా?'' అని ఫోన్ సంభాషణల్లో జెలెన్‌స్కీని ట్రంప్ అడిగినట్టు తెలుస్తోంది. జెలెన్‌స్కీ తడుముకోకుండా 'కచ్చితంగా. మీరు ఆయుధాలిస్తే మేము ఆ పని చేస్తాం' అని సమాధానమిచ్చారు.
'పుతిన్ చాలా సుతిమెత్తగా మాట్లాడతారు. సాయంత్రం అయ్యేసరికి బాంబులతో దాడులు చేస్తారు. వాళ్లు (ఉక్రెయిన్) తమ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఉక్రెయిన్‌కు పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు పంపుతాం' అని ట్రంప్ అదివారం ప్రకటించారు. అయితే ఆయుధాలను వాషింగ్టన్ పంపిందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. రష్యాకు కూడా బాధ తెలిసి రావాలని, చర్చలకు క్రెమ్లిన్‌ను దిగొచ్చేలా చేయాలన్నదే ట్రంప్ తాజా ఆలోచనగా చెబుతున్నారు. మాస్కో, కీవ్ మధ్య యుద్ధం నాలుగో సంవత్సరంలోకి అడుగుపెట్టినా కాల్పుల విరమణకు రష్యా నిరాకరిస్తూ వస్తోంది. కొద్ది నెలలుగా ఉక్రెయిన్‌పై రికార్డు స్థాయిలో డ్రోన్లు, క్షిపణలపై విరుచుకుపడుతోంది.
క్రెమ్లిన్ ఘాటు స్పందన..
కీవ్‌కు మరిన్ని ఆయుధాలు పంపుతామని, రష్యాపై ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ప్రకటిస్తుండటంపై క్రెమ్లిన్ స్పందించింది. ఇది శాంతికి జరిపే యత్నాల్లా కనిపించడం లేదని, యుద్ధం కొనసాగింపునే కోరుకుంటున్నట్టు కనిపిస్తోందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చాలా తీవ్రంగా ఉందని, వాష్టింగ్టన్‌లో ఏమి చెప్పారనే దానిని విశ్లేషించేందుకు తమకు కొంత సమయం కావాలని మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
శుభాంశు శుక్లా బృందాన్ని ఆసుపత్రికి తరలించిన నాసా..
భారత్, పాకిస్తాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి