Trump: ఇజ్రాయెలే మాకు అప్పగిస్తుంది..
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:14 AM
యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు.

గాజా స్వాధీనంలో మా సైన్యం ప్రమేయం ఉండదు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ
వాషింగ్టన్, ఫిబ్రవరి 6: యుద్ధం ముగిసిన అనంతరం గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ తమకు స్వాధీనం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దీంట్లో అమెరికా దళాల ప్రమేయం ఏమీ ఉండదని ఆయన తేల్చిచెప్పారు. గాజా పునర్నిర్మాణం జరిగే వరకూ సుమారు 2 లక్షల మంది పాలస్తీనీయులను శరణార్థులుగా స్వీకరించాలంటూ ఇటీవల ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, అరబ్‌లీగ్, పాలస్తీనా అథారిటీని ట్రంప్ కోరగా.. ఆయా దేశాలు ఆ ప్రతిపాదనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో గాజాను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని మంగళవారం ఆయన ప్రకటించారు. ఆ ప్రకటనపైనా అరబ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. గాజా విషయంలో తమ సైన్యం ప్రమేయం ఉండదంటూ గురువారం ఆయన స్పష్టత ఇచ్చారు.
నిజానికి అసలు పాలస్తీనియన్లు ఇప్పటికే అత్యంత అధునాతనమైన, ఆధునిక నివాసాల్లో, అందమైన కమ్యూనిటీల్లో పునరావాసం ఏర్పరచుకుని ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్.. డెమొక్రాట్ పార్టీకి చెందిన పాలస్తీనా సంతతి మైనారిటీ నేత, సెనెటర్ చుక్ షుమర్ పేరును సైతం ప్రస్తావించడం గమనార్హం. గాజా ప్రాంతంలోని పాలస్తీనియన్లు ఆయన లాగా వేరే ప్రాంతాల్లో/దేశాల్లో స్థిరపడి ఉండాలన్న భావనను పరోక్షంగా వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదిస్తున్న బలవంతంపు తరలింపు ప్రక్రియను.. పాలస్తీనియన్లకు ఆనందంగా, సురక్షితంగా, స్వేచ్ఛగా జీవించే అవకాశంగా ట్రంప్ అభివర్ణించారు. గాజా ప్రాంత అభివృద్ధికి ప్రపంచం నలుమూలల నుంచీ బృందాలను రప్పిస్తామని.. అక్కడ నిదానంగా, జాగ్రత్తగా నిర్మాణ పనులు చేపట్టి దాన్నొక భూతలస్వర్గంగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు.