Trade Tariff War: భారత్ పై ట్రంప్ టారిఫ్స్.. అమెరికాకు ఇచ్చిపడేసిన చైనా
ABN , Publish Date - Jul 30 , 2025 | 09:44 PM
భారతదేశంపై ఇక నుంచి 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ తోపాటు జరిమానా కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా మండిపడింది. టారిఫ్ యుద్ధాలకు విజేతలు ఉండరంటూ కఠినమైన సందేశమిచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంపై ఇక నుంచి 25 శాతం ట్రేడ్ టారిఫ్స్ తోపాటు జరిమానా కూడా విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో చైనా మండిపడింది. టారిఫ్ యుద్ధాలకు విజేతలు ఉండరంటూ ట్రంప్‌కు చైనా కఠినమైన సందేశమిచ్చింది. డోనాల్డ్ ట్రంప్ తన స్వంత సోషల్ మీడియా నెట్ వర్క్ అయిన ట్రూత్ లో భారత్ ను ఉద్దేశించి పెట్టిన సందేశంలో చైనాను కూడా లాగడంతో డ్రాగన్ కంట్రీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. ట్రంప్ తన సందేశంలో భారత్ తో పాటు, చైనాను కూడా విమర్శలు చేశారు.
ఒక పక్క రష్యా అత్యంత కిరాతకంగా ఉక్రెయిన్ మీద చేస్తున్న యుద్ధాన్ని ఆపాలని ప్రపంచదేశాలు కోరుకుంటుంటే, భారత్, చైనా దేశాలు మాత్రం రష్యాకు పరోక్షంగా సహకరిస్తున్నాయన్నది ట్రంప్ వాదన. ఇండియా, చైనా దేశాలు రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నాయని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇది సహించరానిదని కూడా వ్యాఖ్యానించారు.
దీంతో చైనా రంగంలోకి దిగింది. ట్రంప్ ప్రకటనను ఛీత్కరించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తన 'ఎక్స్' ఖాతాలో చేసిన పోస్ట్ లో వాషింగ్టన్‌ను హెచ్చరించారు. బీజింగ్ తన 'సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను' ఎప్పటికీ కాపాడుకుంటూనే ఉంటుందని తేల్చి చెప్పారు. రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తే బీజింగ్‌పై సుంకాలు విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టారిఫ్ యుద్ధాలకు విజేతలు ఉండరు అని పేర్కొంది. చైనా ఎల్లప్పుడూ తన జాతీయ ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా తన ఇంధన సరఫరాను వ్యవస్థను నిర్ధారించుకుంటుందని ఆయన తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి
రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..
అదృష్టం అంటే ఈమెదే.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..