Zelenskyy-Stramer Meeting: ట్రంప్ ఇచ్చిన షాక్ నుంచి రిలీఫ్.. జెలెన్‌స్కీకి మద్దతుగా యూకే
ABN , Publish Date - Mar 02 , 2025 | 09:26 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం రసాభాసగా మారిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భారీ ఊరట దక్కింది. ఉక్రెయిన్ మిలిటరీ సామర్థ్యాల పెంపు కోసం 2.26 బిలియన్ పౌండ్ల రుణం ఇచ్చేందుకు బ్రిటన్ ముందుకొచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన షాక్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి భారీ ఊరట దక్కింది. తాము ఉక్రెయిన్ వెంటే ఉంటామంటూ బ్రిటన్ ప్రధాని భరోసా ఇచ్చారు. అమెరికా పర్యటన అనంతరం బ్రిటన్‌కు వెళ్లిన జెలెన్‌స్కీ బ్రిటన్ ప్రధానితో భారీ రుణ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉక్రెయిన్ రక్షణ సామర్థ్యాల పెంపు కోసం ఏకంగా 2.26 బిలియన్ పౌండ్ల రుణసాయం చేసేందుకు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ అంగీకరించారు. రష్యా ఆస్తులపై ఆంక్షల ద్వారా వచ్చే లాభాలతో ఈ రుణాన్ని తిరిగి చెల్లించేందకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు రుణ ఒప్పందంపై ఉక్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సెర్గీ మర్‌చెంకో, ఛాన్సలర్ రేచల్ రీవ్స్ సంతకాలు చేశారు. ఈ లోన్‌లో తొలి విడత నగదు వచ్చే వారానికి కల్లా ఉక్రెయిన్‌కు అందుతుంది (Zelenskyy-Stramer Meeting).
డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశానికి భిన్నంగా ప్రశాంత వాతావరణంలో ఉక్రెయిన్, బ్రిటన్ దేశాధినేతల సమావేశం సాగింది. తొలుత జెలెన్‌స్కీకి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ ఆత్మీయ ఆలింగనంతో సాదర స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌కు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ తమకు అండగా నిలిచిన బ్రిటన్‌కు జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు. యావత్ బ్రిటన్ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉందని బ్రిటన్ ప్రధాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జెలెన్‌స్కీకి మద్దతుగా నినాదాలు చేస్తున్న వారిని చూపిస్తూ బ్రిటన్ ప్రధాని ఈ వ్యా్ఖ్యలు చేశారు. ‘‘మాకు ఇంత మంచి మిత్రులు ఉండటం నిజంగా హర్షణీయం. యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకూ మాకు అండగా ఉన్న ప్రజలు ధన్యవాదాలు’’ అని అన్నారు.
ట్రంప్, జెలెన్‌స్కీ మాటల యుద్ధం.. చూసి తట్టుకోలేక తలపట్టుకున్న ఉక్రెయిన దౌత్యవేత్త
కాగా, ఆదివారం బ్రిటన్ రాజు ఛార్ల్స్ కూడా జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు. ఇక ఉక్రెయిన్‌కు మద్దతుగా రాజు ఛార్ల్స్ గతంలోనే అనేక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ ప్రజలు పోరాట పటిమ, దృఢసంకల్పం గొప్పవని ఇటీవల ఆయన ప్రశంసించారు. ఇదెలా ఉంటే, రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చల కోసం ఐరోపా దేశాలు సమావేశం కానున్నాయి. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదెలా ఉంటే, ఉక్రెయిన్‌పై డొనాల్డ్ ట్రంప్ మండిపడుతున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌కు మద్దతు ఉపసంహరించుస్తానని కూడా ఇటీవల ఆయన హెచ్చరించారు.
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి