Shooting: పాఠశాలలో కాల్పులు.. 10 మంది మృతి
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:57 AM
నగర శివార్లలోని ఓ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. స్కూల్లో జరిగిన కాల్పుల్లో దుండగుడితో సహా దాదాపు 10 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

స్వీడన్(Sweden)లోని ఒరెబ్రో నగర శివార్లలో ఉన్న ఓ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో (Shooting) 10 మంది మృతి చెందారు. మంగళవారం రోజున పోలీసు అధికారులు ఈ విషయం వెల్లడించారు. మరణించిన వారి సంఖ్య అనుమానిత దుండగుడితో సహా 10కి పెరిగిందని తెలిపారు. తుది మరణాల సంఖ్య ఇంకా ఖరారు కాలేదు. అలాగే గాయపడిన వారి పరిస్థితి సమాచారం కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటన స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరెబ్రో నగర శివార్లలో చోటు చేసుకుంది. ఈ అడల్ట్ ఎడ్యూకేషన్ కేంద్రంలో 20 ఏళ్లకు పైబడిన విద్యార్థులకు ప్రాథమిక, ఉన్నత మాధ్యమిక కోర్సులను అందిస్తున్నారు. అలాగే వలసదారులకు స్వీడిష్ భాష తరగతులు, వృత్తి శిక్షణ, మేధో వైకల్యంతో ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
కాల్పుల సమయంలో..
పోలీసు అధికారుల ప్రకారం కాల్పులు జరిగిన సమయంలో విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఆ సమయంలో తక్కువ మంది విద్యార్థులు ఉన్నారు. కాల్పుల ఘటన నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది భయాందోళన చెంది పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ భారీ నష్టానికి గల కారణాన్ని ప్రస్తుతం ఖచ్చితంగా గుర్తించడం కష్టంగా ఉందని స్థానిక పోలీసు అధికారి రాబర్టో ఈద్ ఫారెస్ట్ అన్నారు.
ఎందుకు దాడి జరిగింది?
ఈ ఘటనపై పాఠశాల అధ్యాపకురాలు లీనా వారెన్‌మార్క్ మీడియాతో మాట్లాడారు. తాను దాదాపు 10 తుపాకీ కాల్పులు విన్నానని పేర్కొన్నారు. పరీక్షలు జరిగిన సమయంలో వచ్చాయని, ఆ సమయంలో విద్యార్థులు తక్కువగా ఉన్నారని చెప్పారు. కానీ ప్రస్తుతానికి నేరస్థుడి గురించి పూర్తి సమాచారం లేదు. స్థానిక అధికారులు పేర్కొన్నట్లుగా ఇది పూర్తిగా అనుకోని దాడి కావచ్చని, ఎటువంటి హెచ్చరికలు లేకుండా జరిగిందని అంటున్నారు. స్వీడన్‌లో ఇలా పెద్ద స్థాయి కాల్పులు జరగడం చాలా అరుదు. అయితే ఇటీవల కాలంలో యూరోప్‌లో కాల్పుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
కాల్పుల నేపథ్యంలో
ఈ ఘటన తరువాత విద్యార్థులను పాఠశాల నుంచి బయటకు తరలించి, సమీపంలోని భవనంలోకి తీసుకెళ్లారు. ఒక విద్యార్థి ఈ ఘటనపై మాట్లాడుతూ మేము మూడు తీవ్రమైన కాల్పుల శబ్దం, పెద్దగా అరుపులను విన్నామని 28 ఏళ్ల ఆండ్రియాస్ సుండ్లింగ్ అన్నారు. ఆ సమయంలో మా గదిని బారికేడ్ చేసి చేయాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి ఘటనలు ప్రజల్లో మరింత భయాన్ని పెంచుతున్నాయని స్థానికులు అంటున్నారు. పాఠశాల కమ్యూనిటీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మరోవైపు ఈ ఘటనపై సంతాపం తెలిపేందుకు స్వీడన్ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోంది.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News